ప్రపంచం సాంకేతికంగా వేగంగా మారుతోంది. కృత్రిమ మేధ (AI) అభివృద్ధి దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు ఉద్యోగాల భవిష్యత్తు, ఉత్పాదకత, అవకాశాల గురించి ఆసక్తికరంగా ఉన్నాయి.ఏఐ ప్రభావంతో పలు ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని గేట్స్ తెలిపారు. ముఖ్యంగా పారాలీగల్స్, ఎంట్రీ లెవల్ అకౌంటెంట్లు, టెలిసేల్స్ వంటి రోల్స్ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఈ మార్పులు తక్కువ కాలానికే చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాధారణ కోడింగ్ పని ఏఐ చేతుల్లోకి!
సాధారణమైన కోడింగ్ టాస్కులు, టెక్నికల్ సపోర్ట్ వంటి పనుల్లో ఏఐ ఇప్పటికే తన సామర్థ్యం చూపుతోందని గేట్స్ తెలిపారు. అయితే, అత్యంత క్లిష్టమైన కోడింగ్ ఛాలెంజెస్ విషయంలో మాత్రం ఇది ఇంకా తక్కువ స్థాయిలో ఉందని స్పష్టం చేశారు. “ఈ స్థాయికి చేరడానికి ఒకటి రెండు సంవత్సరాలు పడుతుందా, లేక దశాబ్దం తీసుకుంటుందా అన్నదానిపై నిపుణుల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.గేట్స్ చెప్పిన మరో ముఖ్య విషయం – అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏఐ చేసే సానుకూల ప్రభావం. విద్య, ఆరోగ్య రంగాలు, వ్యవసాయం వంటి సెక్టార్లలో ఉత్పాదకతను పెంచేందుకు ఏఐను ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “అల్ప ఆదాయ దేశాల్లో మార్పు తేవాలంటే ఏఐనే ఆధారంగా చేసుకోవాలి” అని ఆయన అన్నారు.
ఉత్పాదకత పెరుగుతుంది, కానీ సరైన వినియోగం అవసరం
ఏఐను సరైన దిశలో ఉపయోగిస్తే, అది మానవాళి అభివృద్ధికి దోహదపడుతుంది అని గేట్స్ స్పష్టం చేశారు. ఇది మానవ శక్తిని మరింత గణనీయంగా పెంచగలదని, కానీ దీనిని సరిగ్గా వినియోగించాల్సిన బాధ్యత మనదే అని గుర్తుచేశారు.గతంలో ఫ్యాక్టరీల్లో రొబోటిక్ ఆర్మ్స్ రావడంతో బ్లూ-కాలర్ ఉద్యోగాలు ప్రభావితమైనట్టు, ఇప్పుడు వైట్-కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపనుందని గేట్స్ వివరించారు. ఉద్యోగ రంగాల్లో ఈ మార్పులు అనివార్యం కావడంతో ప్రపంచం ముందుగానే సిద్ధం కావాలని ఆయన సూచించారు.
మార్పు అనివార్యం – దాన్ని అంగీకరించాలి
ప్రపంచం మెల్లిగా కాకుండా వేగంగా మారుతోంది. గేట్స్ చెప్పినట్టు, ఈ మార్పును ఆపలేం. అయితే దాన్ని అర్థం చేసుకుని, అందుకు తగిన విధంగా స్కిల్ల్స్‌ను మారుస్తూ ముందుకు సాగాల్సిన అవసరం మనపై ఉంది. ఏఐ భయపడాల్సింది కాదు, ఉపయోగించుకోవాల్సింది!
Read Also : Ashwini Vaishnaw : భారత్ లో దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్స్