సుప్రీంకోర్టు కారుణ్య నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగ నియామకంపై ధర్మాసనం పలు పాయింట్లు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకం హక్కు కాదని అనుకోకుండా ఎదురైన ప్రతికూల సందర్భం నుంచి బాధిత కుటుంబానికి ఉపశమనం కలిగించడమే కారుణ్య నియామకం ఉద్దేశమని,అవసరాలకు కనీస డబ్బు కూడా లేని వాళ్లకే ఈ ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపింది. అంతేకానీ మరణించిన ఉద్యోగి కుటుంబ జీవన ప్రమాణాలు తగ్గిపోతాయనే కారణంతో ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని,మరణించిన ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం నడుస్తున్న పరిస్థితుల్లోనే కుటుంబ సభ్యుల్లోని అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది కారుణ్య నియామక ఉద్దేశమని తెలిపింది.సాధారణ ఉద్యోగ నియమాల ప్రకారం.. కారుణ్య నియామకం మాత్రమేననీ పేర్కొంది. ఇది మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యునికి అందజేయబడుతుంది, తద్వారా వారు వారి జీవనోపాధి నుండి ఉపశమనం పొందుతారు. అటువంటి సందర్భంలో మానవత్వ ప్రాతిపదిక తీసుకోబడుతుండటమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమని పేర్కొంది.

కెనరా బ్యాంక్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి పదవీ విరమణ కంటే ముందు 2001లో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే బ్యాంకు ఉన్నతాధికారి దాన్ని తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2 నెలల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.కారుణ్య ప్రాతిపదికన నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టం చేసిన చట్టం ప్రకారం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16 ప్రకారం అన్ని ప్రభుత్వ ఖాళీలకు అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాల గురించి తెలియజేస్తుంది. మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వ్యక్తికి కారుణ్య నియామకం ఈ నిబంధనలకు మినహాయింపు అని బెంచ్ సెప్టెంబర్ 30న తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కారుణ్య ప్రాతిపదికన నియామకం ఒక మినహాయింపు మాత్రమేననీ, హక్కు కాదని పేర్కొంది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ మిశ్రాల వ్యాఖ్యలు
ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.