అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు అన్నీ అనుకూలిస్తే మంగళవారం సాయంత్రం భూమి మీదకు రానున్నట్లు నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌లో నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌తో పాటు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు తిరిగి భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు భూమి మీదకు వచ్చే స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌ను లైవ్ కవరేజ్‌గా అందించనున్నట్టు నాసా తెలిపింది.

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.15కు
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 17) రాత్రి 10.45కు అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.15కు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ బయలుదేరనున్నట్టు చెప్పింది. ఈ ప్రయాణంలో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు మూసే దగ్గరి నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్‌గా ఇవ్వనున్నట్లు నాసా తెలిపింది. అంతర్జా తీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చే ఏజెన్సీ క్రూ-9 మిషన్ కోసం ఫ్లోరిడా తీర ప్రాంతంలో వాతావరణ, ఇతర పరిస్థితులన్నింటినీ నాసా, స్పేస్‌ఎక్స్‌లు ఆదివారమే పరిశీలించాయి.సునీతా విలియమ్స్, విల్‌మోర్ భూమి మీదకు తిరిగిరావడానికి అనువుగా, వారిని రిలీవ్ చేసేందుకు స్పేస్ ఎక్స్‌లో పంపిన నలుగురు వ్యోమగాములు ఇప్పటికే ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. వారికి చెందిన ఓ వీడియోను నాసా విడుదల చేసింది.
9 నెలల అంతరిక్ష వాసం ముగింపు దశకు
ఐఎస్ఎస్ చేరుకున్న నలుగురు వ్యోమగాములకు సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు అందులో ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. బాధ్యతలు అప్పగించి బయల్దేరుతారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత,విల్‌మోర్‌లను వెనక్కు తీసుకువచ్చే ప్రణాళికలో భాగంగా నలుగురు వ్యోమగాములతో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. దీంతో సునీత, విల్‌మోర్‌ల 9 నెలల అంతరిక్ష వాసం ముగింపు దశకు చేరుకుంది. కొత్త వ్యోమగాములకు వీరిద్దరూ బాధ్యతలు అప్పగించడానికి రెండురోజులు పడుతుందని, ఆ తరువాత వాతావరణ అనుకూలతను బట్టి వారి తిరుగు ప్రయాణం ఉంటుందని ఇప్పటికే నాసా ప్రకటించింది.
కచ్చితంగా వాతావరణం అనుకూలించాలి..
‘‘కచ్చితంగా వాతావరణం అనుకూలించాలి. అప్పుడే వారి తిరుగు ప్రయాణం ఉంటుంది’’ అని ఐఎస్ఎస్ ప్రోగ్రామ్ మేనేజర్ డానా వీగెల్ ఇప్పటికే చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకు వెళ్లడానికి, తీసుకు రావడానికి నాసా ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌కు చెందిన రాకెట్లను ఉపయోగిస్తోంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకు వెళ్లేందుకు నాసా చేపట్టిన పదకొండో మిషన్ ఇది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఐఎస్ఎస్‌తో విడివడిన తర్వాత మార్చ్ 16,19 మధ్యన ఈ రాకెట్ భూ కక్ష్యలోకి వచ్చేలా ఈ మిషన్‌ను షెడ్యూల్ చేశారు. రాకెట్ తిరుగు ప్రయాణానికి నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి మీదకు రానున్నారు. సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కితే ఆమె పేరున మరో రికార్డు నమోదవుతుంది. నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత గుర్తింపు పొందుతారు.
ఆరోగ్యం దెబ్బతింటుందా?
సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల అస్ట్రోనాట్స్ శరీరంలో వచ్చే మార్పులపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అయితే అస్ట్రోనాట్స్ ఇద్దరూ ఇది తమకు లభించిన అరుదైన అవకాశం అని అంటున్నారు. వీళ్లిద్దరూ అంతరిక్షంలో ఉన్న 9నెలల కాలంలో క్రూ నైన్‌తో కలిసి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు.