Children Stories: అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు. అదే సమయంలో పశ్చిమ సముద్రం పక్కన మారేడు చెట్టు, తాడిచెట్లు గుంపులు గుంపులుగా ఉండేవి. ఒక కుందేలు మారేడు చెట్టు మొదట్లో జీవించేది. తాడిచెట్టు నీడలో ఆడుకునేది, విశ్రమించేది. ఒకరోజు అది తాడిచెట్టు నీడలో విశ్రమించేది.
ఈ భూమి ఏదైనా ఒకరోజు తలకిందులయిపోతే నేనేమైపోతాను” అని అనుకునేది.
అది అలా ఆలోచిస్తున్న సమయంలో మారేడు చెట్టు నుండి ఒక పండు ఊడి తాటి ఆకు మీద పడింది, శబ్దం అయింది. ఆలోచనల్లో ఉన్న కుందేలు ఉలిక్కిపడింది. “అమ్మో, భూమి తలకిందులయింది” అని అనుకుంది. కుందేలు ఆలోచనలన్నీ భూమి తలకిందులవటం గురించి ఉండటంతో, ఆ శబ్దం భూమి తలకిందులయ్యే శబ్దంగా భ్రమించి, భయపడి, పరుగు తీయటం ఆరంభించింది కుందేలు.
అతి వేగంగా భయంతో అరుస్తూ పరుగెత్తుతున్న కుందేలును చూసి, ఇంకో కుందేలు కూడా దాని వెనకే పరుగెత్తటం ప్రారంభించింది. “ఏమైంది? ఎందుకు భయంతో పరుగెత్తుతున్నావు?” కుందేలు వెనకే వస్తూ అడిగింది. రెండో కుందేలు. “నన్నేమీ అడగకు, పరుగెత్తు” అని వేగం పెంచింది మొదటి కుందేలు. ఈ రెండు కుందేళ్లు పరుగెత్తటం చూసి ఒకటొకటిగా ఇతర కుందేళ్లు సైతం వాటి వెంట పరుగిడసాగాయి. “ఏమైంది?” ఎందుకు? మనం ప్రాణ భయంతో పరుగెత్తుతున్నాం?” మొదటి కుందేలు పరుగు ఆపకుండా. వెనక్కి తిరిగి చూడకుండానే సమాధానం ఇచ్చింది. “పరుగెత్తండి.. భూమి తలకిందులవుతోంది”. దాంతో మిగతా కుందేళ్లు కూడా పరుగువేగం పెంచాయి. ఈ రకంగా కొన్ని వేల కుందేళ్ల గుంపు ఎటు పరుగెత్తుతున్నాయో, గమ్యం ఏమిటో కూడా తెలియకుండా. కుందేళ్లు ఇలా గుంపులా పరుగెత్తటం చూసి ఒక లేడి కూడా వాటి వెంట పరుగు ఆరంభించింది.
అది చూసి ఇతర లేళ్లు కూడా వాటిని అనుసరించాయి. కుందేళ్లు. లేళ్లు పరుగెత్తటం చూసి “విషయం ఏమిటని?” అడవిపంది అడిగింది.
సమాధానం సరిగ్గా రాలేదు కానీ వాటి భయం తెలిసిన అడవిపంది కూడా పరుగు ప్రారంభించింది. దాంతో అడవి పందుల గుంపు కూడా పరుగు ప్రారంభించింది.
ఇలా ఒకటొకటిగా.. నీటిమృగం, అడవిదున్న, ఎద్దు, ఖడ్గమృగం, పెద్దపులి, సింహం, ఏనుగుల గుంపులు కూడా పరుగు ప్రారంభించాయి.
“ఏమైంది? ఎందుకు పరుగెత్తుతున్నాం?” అని అడుగుతూనే ఉన్నాయి.
“భూమి తలకిందులయ్యిందట” ఎవరో సమాధానం ఇచ్చారు. అలా ప్రశ్న, సమాధానం చెప్పుకుంటూనే అడవి దారిన జంతువులన్నీ పరుగు పెడుతూనే ఉన్నాయి. ఇలా జంతువులన్నీ పరుగెత్తటం చూశాడు బోధిసత్వుడు. విషయం తెలుసుకుందామని పరుగెడుతున్న జంతువును అడిగాడు. “ఎందుకని పరుగెడుతున్నారు? ఎటు పరుగులు తీస్తున్నారు?”
జంతువులు పరుగు ఆపలేదు. “భూమి తలకిందువుతోంది” పరుగు ఆపకుండానే చెప్పింది.. బోధిసత్త్వుడు ఆలోచించాడు. ‘భూమి తలకిందులవటం అసంభవం.
ఇవి ఏదో చూసి ఉంటాయి. ఏదో అనుకుని ఉంటాయి. వీటికి నిజం చెప్పి, పరుగు ఆపకపోతే ఇవన్నీ ఇలా పరుగెత్తి, పరుగెత్తి నశిస్తాయి. కాబట్టి వీటి పరుగును ఆపాలి. వీటిని బతికించాలి” అని నిశ్చయించుకున్నాడు.
వెంటనే అన్ని జంతువుల కన్నా వేగంగా పరుగెత్తాడు. వాటిని దాటి ముందుకు వెళ్లాడు.
పర్వతం ఎక్కి పర్వతం చివరన నిలబడి మూడు మార్లు భయంకరంగా సింహనాదం చేశాడు.
ఆ సింహనాదం విని పరుగెత్తుతున్న జంతువులన్నీ ఆగిపోయాయి, భయంతో వణికిపోయాయి.
వాటి మధ్యకు వెళ్లాడు బోధిసత్వుడు.
“ఎందుకు పరుగెత్తుతున్నారు?” అని అడిగాడు.
“భూమి తలకిందులయింది.. అందుకు” సమాధానం వచ్చింది.
“భూమి తలకిందులవటం ఎవరు చూశారు?”
“ఏమో నాకు తెలియదు”
“ఏనుగుకు తెలుసేమో?”
“నాకు తెలియదు. సింహానికి తెలుసేమో!”
“నాకు తెలియదు, పులికి తెలుసు”
“నాకు తెలియదు, ఖడ్గమృగానికి తెలుసు”.
“నాకు తెలియదు. వృషభాన్ని చూసి నేను పరుగుపెట్టాను. వృషభానికి తెలుస్తుంది”.
“నాకు తెలియదు, మహిషానికి తెలుసు”.
“నాకు తెలియదు. నీటి మృగానికి తెలుసు.
“నాకేం తెలుస్తుంది? పందిని చూసి నేను పరుగెత్తాను” “నాకస్సలు తెలియదు. నేను కుందేలును చూసి పరుగెత్తాను”
కుందేళ్లను అడిగితే సౌమ్యుడనే కుందేలు మొదట పరుగు ప్రారంభించినట్టు తెలిసింది.
“సౌమ్యా, భూమి తలకిందులటం నువ్వు చూశావా?” అడిగాడు, బోధిసత్వుడు..
“నేను చూశాను”
“ఎక్కడ నుండి చూశావు?”
“పశ్చిమ సముద్రం దగ్గర. వనంలో పడుకుని వున్నప్పుడు భూమి తలకిందులయితే ఎటు పోవచ్చని అలోచించాను.
అంతలోనే భూమి తలకిందులయిన పెద్ద శబ్దం వినిపించింది. నేను పరుగెత్తటం ప్రారంభించాను”,
దాని మాటలకు బోధిసత్వుడు నవ్వాడు. “నువ్వు మారేడు పండు రాలిన చప్పుడు విన్నావు. భూమి తలకిందులయిందని భ్రమ పడ్డావు. పదండి.. నాతో రండి. ఆ తోటకు వెళ్లి చూద్దాం. భూమి తలకిందులయిందో, లేదో తెలుసుకుందాం”. జంతువులు అటు రావటానికి భయపడ్డాయి..
కుందేలు ముందు భయపడింది. బోధిసత్వుడు దైర్యం చెప్పటంతో అతడి వీపునెక్కి కూర్చుంది.
ఇద్దరూ కలసి కుందేలు పడుకున్న చోటుకు వెళ్లారు.
భూమి తలకిందులైందని భ్రమలో పరుగెత్తిన జంతువులు
“ఇదిగో.. నేను ఇక్కడ పడుకున్నప్పుడే పెద్ద శబ్దం అయింది” చెప్పింది కుందేలు, సింహం ఆ స్థలమంతా పరిశీలనగా చూసింది. తాటి ఆకు మీద పడి వున్న మారేడు పండును చూసింది.
విషయం గ్రహించింది. కుందేలుకు అది చూపించింది. వెంటనే కుందేలుతో పాటు జంతువులన్నీ ఉన్న స్థలానికి వెళ్లింది. వాటికి జరిగిన విషయం చెప్పింది.
అన్నీ తమ మూర్ఖత్వానికి నవ్వుకున్నాయి.. పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నుంచి తప్పించినందుకు బోధిసత్త్వుడిని అభినందించాయి. “ఈ ఆచార వ్యవహారాలు, యజ్ఞ యాగాదులు పాటించేవారు కూడా ఇలా ఎందుకు పరుగులు తీస్తున్నామో తెలియకుండా పరుగులు తీసేవారే.
మంచి ఆచారంతో ప్రజ్ఞతో హృదయాన్ని అదుపులో పెట్టుకునేవారు ధీరచిత్తులు, వారు ఎవ్వరినీ గుడ్డిగా అనుసరించరు” అంటూ కథను ముగించాడు శాస్త.
చివరలో “ఆ కాలంలో అందరి ప్రాణాలను కాపాడిన సింహాన్ని నేనే” అని చెప్పాడు.