Nageshwara Swami Temple : ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలో పురాతన ఆలయాలు కనిపిస్తాయి. నాటి సంఘంలో హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, దైవభక్తిని పెంపొందించడానికి ఆలయ నిర్మాణం జరిగింది. దేవాలయం అనగా సకల చరాచర సృష్టికర్త అయిన దేవదేవుని నిలయం. ప్రతి ఒక్క ఆలయం తమదైన ప్రత్యేకతలతో నిత్యపూజలతో కళకళలాడుతున్నాయి. దీనికి కారణం నాడు నాటిన దైవభక్తి బీజాలే! ఇన్ని వందల సంవత్సరాలుగా నిత్యం పూజలు జరుగుతూ వస్తున్నాయి అంటే కారణం.. గ్రామస్థుల హృదయాలలో తరతరాలుగా సుస్థిరంగా స్థిరపడిన భక్తిభావం. ఆ నిఖిల జగద్రక్షకుని పట్ల వారికి గల నమ్మకం, వంశపారంపర్యంగా ఆలయాలను ఆధారంగా చేసుకొని నిరాకార స్వరూపుడైన పరమేశ్వరుని సేవిస్తూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న అర్చక స్వాముల అచంచల విశ్వాసం. ఇలాంటి దృఢమైన భక్తిశ్రద్ధలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూజలు, ఉత్సవాలు మన హిందూ ధర్మంలో తప్ప మరెక్కడా కనిపించవు. ఇంతటి గౌరవం దక్కించుకొన్న హిందూ సమాజం సాటి మరొకటి ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు. కృష్ణా నదీ తీరంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా పురాతన ఆలయాలు కనిపిస్తున్నాయి. ఆ ఆలయాల ప్రత్యేకతల గురించి అందరికీ తెలియచేయాలన్న సంకల్పంతోక్షేత్రాలను సందర్శించి వివరాలు సేకరించి ఈ వ్యాసాలను రాయడం జరిగింది. ఆ పరంపరలో తెలియచేస్తున్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం, విజయవాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్రావూరు అనే గ్రామంలో ఉన్నది. చిర్రావూరు కృష్ణానదీ తీర గ్రామం. గుంటూరు జిల్లాలో ఉన్నా చిర్రావూరు విజయవాడకి దగ్గరగా ఉంటుంది. విజయవాడ నుండి గుంటూరు వెళ్లే మార్గంలో తాడేపల్లి నుండి కుంచనపల్లి, గుండిమెడ గ్రామాల మీదుగా చిర్రావూరు సులభంగా చేరుకోవచ్చు. తెనాలి, మంగళగిరి నుండి కూడా చిర్రావూరు వయా రేవేంద్రపాడు, దుగ్గిరాల మీదగా వెళ్లడానికి చక్కని రహదారి ఉన్నది. విజయవాడ నుంచి సిటీ బస్సులు కూడా లభిస్తాయి. స్వంత వాహనంలో వెళితే చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఆలయాలను కూడా దర్శించుకొనే అవకాశం లభిస్తుంది.
ఇది పురాతన ఆలయం. ఆలయ నిర్మాణ కాలం గురించి, ఎవరు నిర్మించారు అన్న వివరాలు ఏవీ తెలియడం లేదు. శాసనాలు కూడా కనిపించవు. కానీ ఆలయ నిర్మాణ శైలి, కొలువైన దేవీదేవతల విగ్రహాలు చూసిన మీదట కొంతవరకు ఒక అంచనాకు రావచ్చు.
Nageshwara Swami Temple : ఆలయ చరిత్ర ఈ ప్రాంతాన్ని పదో శతాబ్ద కాలంలో చాళుక్య రాజులు పరిపాలించారు. వారు తమ రాజ్యంలో అనేక ఆలయాలను నిర్మించారని తెలుస్తోంది. ముఖ్యంగా వారు ఆలయాలు లేని గ్రామాలను గుర్తించి అక్కడ శివ, విష్ణు ఆలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది. అలా ఈ ఆలయం కూడా వారి కాలంలో నిర్మించినట్లు, భావి విజయనగర పాలకులు చివరగా అమరావతి పాలకుడైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ఆలయాల పునః నిర్మాణం చేయడమే కాకుండా నిర్వహణకు నిధులు, భూమి దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాంగణంలో ఉన్న పురాతన విగ్రహాలు, నందీశ్వరుడు, విమాన గోపురం, గర్భాలయంలోని శివలింగం మనకు తెలుపుతాయి.. మేం చాలా కాలంగా ఇక్కడ ఉన్నాం అన్న విషయాన్నీ! ముఖమండపం పైన కనిపించే విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు.
ఆలయ విశేషాలు జమ్మి, రావి, ఉసిరి, మారేడు, పారిజాతం, వేప, మామిడి చెట్లతో నిండిన ప్రాంగణంలో ఉంటుందీ చిన్న ఆలయం. రాజగోపురం లాంటి పెద్ద నిర్మాణాలు, శిల్పాలు కనిపించవు. సాదాసీదాగా ఉంటుంది. ప్రాంగణంలో కొన్ని నిర్మాణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ముఖమండపం పైన కుమారులతో కొలువైన ఆదిదంపతులు, స్వయంగా అభిషేకం చేసుకొంటున్న గంగాధరుడు, శివలింగ ప్రతిష్ట చేస్తున్న సీతారామచంద్రులు, లక్ష్మణుడు, హనుమంతుడు కనిపిస్తారు. ఆలయానికి ప్రధాన సంకేతం అయిన ఎత్తైన ధ్వజస్థంభం దూరానికి స్పష్టంగా కనిపిస్తుంది.
శ్రీ వినాయక సన్నిధి నూతనంగా ప్రాంగణ ఆగ్నేయ దిశలో నిర్మించిన ఈ సన్నిధిలో ఆది దంపతుల ప్రియ పుత్రుడు గణాధిపతి, విఘ్న నాయకుడు శ్రీ వినాయకుడు ఉపస్థితులై ఉంటారు. కుడివైపు తిరిగిన తొండంతో ఉన్న వలంపురి వినాయకుడు. ఇతడు భక్త సులభుడు. మనోభీష్టాలను నెరవేర్చేవాడు. పక్కనే పురాతన భిన్నమైన గణపతి విగ్రహం మనకు ఈ ఆలయం ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించబడింది.. అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ప్రధాన ఆలయం ఈ ఆలయ గర్భాలయ దక్షిణ వెలుపల భాగంలో శ్రీ వేలాయుధ సుబ్రహ్మణ్య స్వామి పైన వీణాపాణి అయిన శ్రీ దక్షిణామూర్తి, ఆ పైన శ్రీ ధ్యానేశ్వరుడు పడమర భాగంలో అర్ధనారీశ్వరుడు, లింగోద్భవుడు, ఆ పైన శ్రీమహావిష్ణువు కనపడతారు. ప్రత్యేకంగా ఉత్తరం పక్కన ఉన్న దేవతా రూపాల గురించి చెప్పుకోవాలి. సహజంగా గోముఖి వద్ద శ్రీ చండికేశ్వరుడు ఉంటారు. కానీ ఇక్కడ శబరిగిరి వాసుడైన శ్రీ ధర్మశాస్త్ర దర్శనమిస్తారు. విమాన గోపురంపైన గదాధరుడైన గంగాధరుడు ఆ పైన విధాత బ్రహ్మ దేవుడు విగ్రహాలు ఉంటాయి. తరిచి చూస్తే ప్రతి విమాన గోపురం పైన త్రిమూర్తులు ఉండటం కనిపిస్తుంది. మిగిలిన దేవీదేవతలు రూపాలను ప్రత్యేకంగా స్థానిక భక్తుల మనోభీష్టాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అనిపిస్తుంది.
తరువాత కాలంలో కాకతీయులు, రెడ్డి రాజులు, ముఖమండపం పైన శివలింగ ప్రతిష్ట చేస్తున్న సీతారామచంద్రులు, పక్కన లక్ష్మణ, హనుమంతుడు కనిపిస్తారు. ఈ రూపాలను ఉంచడానికి ప్రధాన కారణం. కృష్ణాతీరంలో అనేక ప్రదేశాలలో శ్రీరాముడు సపరివారంగా వచ్చి శివ లింగాలను ప్రతిష్ఠించారు అని చెప్పడం. ఈ లింగం కూడా దశరథ రాముని ప్రతిష్ట అవడానికి అవకాశం ఉన్నది. ఆలయ ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం నిర్మించబడింది. నూతన నిర్మాణం, ముఖమండపంలో కొద్దిగా ఎత్తైన గద్దె మీద నందీశ్వరుడు కుడి కాలు ఎత్తిన భంగిమలో తదేక దృష్టితో గర్భాలయం వంక చూస్తుంటారు. ఇలా కుడి కాలు ఎత్తిన నందీశ్వరుడు చోళుల కాలంలో పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠించబడ్డాయి. తమిళనాడులో పలు ఆలయాలలో కుడి కాలు ఎత్తి కూర్చున్న నందీశ్వర విగ్రహాలు కనిపిస్తాయి. తిరువణ్ణామలై (అరుణాచలం)లో కనిపించే నంది విగ్రహాలలో అధిక భాగం కుడి కాలు ఎత్తి ఉండటం గమనించవలసిన విషయం. ఇలా నందీశ్వరుడు కొలువుతీరి ఉండటానికి సంబంధించి ఒక కథ కూడా వినిపిస్తుంది.
చోళులకు బంధువులైన చాళుక్యులు కూడా వారి సంప్రదాయాన్ని అనుసరించి ఉండవచ్చు. అందువలన ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రత్యేక నంది విగ్రహాలు అనేక ఆలయాలలో కనిపిస్తాయి. గర్బాలయ వెలుపలి గోడలలో శ్రీ అనంతనాగ, శ్రీదేవీ రూపం కనిపిస్తాయి, శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం నాగప్రతిష్ఠలకు, సర్ప, రాహు-కేతు దోష పరిహార స్థలం అని చెబుతారు. ఆలయ వాయువ్య భాగంలో నూతనంగా నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ప్రత్యక్ష రూపం. ద్వారపాలకులు దిండి, ముండి కూడా కనిపిస్తారు. ముఖమండపాన్ని గర్భాలయంతో కలుపుతూ చిన్న అర్ధ మండపం ఉంటుంది. అక్కడ ఒక నందీశ్వరుడు కుడి కాలు ఎత్తి ఉపస్థితులై ఉంటారు, గర్భాలయానికి ఇరుపక్కలా వలంపురి వినాయకుడు అమ్మవారి శ్రీ లలితా దేవి ఉపస్థితులై ఉంటారు. అమ్మవారు శ్రీ లలితా దేవి అనంతరకాల ప్రతిష్ట అని భావించవచ్చు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న పెక్కు శివాలయాలలో అమ్మవారిని స్థానిక పాలకులు లేదా గ్రామస్థులు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. గర్భాలయంలో చిన్న పానవట్టం మీద నాగాభరణధారిగా శ్రీ నాగేశ్వరస్వామి లింగ రూపంలో చక్కని అలంకరణలో నేత్రానందంగా భక్తులకు దర్శనం ప్రసాదిస్తారు. కాశీ లింగంగా పిలవబడే ఈ లింగం పైన బ్రహ్మసూత్రం ఉండదు.
నిత్య పూజలు నియమంగా జరిగే ఈ ఆలయంలో ప్రతి నెలా ఒక విశేష పూజ, కార్తిక మాస పూజలు, శివరాత్రి మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. పరిశుభ్ర వాతావరణంలో గ్రామస్థులు, అధికారులు సమిష్టిగా ఆలయ నిర్వహణ చేస్తున్నారు. గణేశ, నవరాత్రి, మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.(Nageshwara Swami Temple)