Mount Fuji : ఫ్యూజి పర్వతం జపాన్ దేశంలోని అత్యంత ఎత్తయిన పర్వత ప్రదేశం. ఇది జపనీస్ ద్వీపం, హోనులో నెలకొని ఉంది. దీని శిఖరం(peak) 3776 మీటర్ల(12,389 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇది మంచుతో కప్పి ఉండే ఒక అందమైన అగ్నిపర్వతం. ఏడాదిలో దాదాపు అయిదు నెలలు పైబడి ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోకి నైరుతి దిశలో యమనాషి-షిజుయోకా సరిహద్దులో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణం నిర్మలంగా ఉన్న రోజున టోక్యో నుంచి స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది మూడు అగ్నిపర్వతాల కలయిక. పై భాగంగా ఉన్నదాన్ని మౌంట్ ఫ్యూజి అని పిలుస్తారు. మధ్య భాగాన కోవెకు అగ్నిపర్వతం, అడుగు భాగాన కొమిఒలరా అగ్నిపర్వతం నెలకొని ఉన్నాయి. 22 జూన్ 2013లో యునెస్కోవారు దీన్ని సాంస్కృతిక ప్రదేశంగా ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
Mount Fuji : జపనీయుల పవిత్ర స్థలం

జపనీయులు ఫ్యూజి పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇది వారి జాతీయ సాంస్కృతిక చిహ్నంగా చెప్పుకోవడానికి గర్వపడతారు. జపాన్ సాహిత్యంలో కూడా ఈ పర్వతానికి సర్వోన్నత స్థానం ఉంది. జపాన్లోని మూడు పవిత్ర పర్వతాలలో ఫ్యూజి ఒకటి. ఫ్యూజితో పాటు టేల్ పర్వతం, హకు పర్వతాన్ని సైతం జపాన్వారు పవిత్రమైనవిగా భావిస్తారు.
ఫ్యూజి పర్వతంపై దేవతలు నివసించేవారని జపనీయులు భావించడం వల్ల ఇదో పూజనీయ ప్రదేశంగా అందరి హృదయాలలో స్థానం పొందింది. ముఖ్యంగా జపాన్లోని షింటో మతస్థులు ఫ్యూజిని అతి పవిత్ర స్థలంగా భావిస్తారు. షింటో మతస్థులు ఫ్యూజి పర్వతాన్ని అధిరోహించాలంటే విధిగా చందనపు చెప్పులు ధరిస్తారు.
చెరన్ అనే బౌద్ధ గురువు 13వ శతాబ్దంలో తన అనుచరులతో కలిసి ఈ పర్వత పాదాల చెంత ఒక బౌద్ధ శాంతివనాన్ని నిర్మించారు. 1960లో సమురాయ్ అనే బౌద్ధ సంస్థ ఆధ్వర్యంలో షో-హోండో బౌద్ధ ఆలయాన్ని నిర్మించారు. ఫ్యూజి అగ్ని పర్వతాన్ని బౌద్ధ మతానికి చెందిన ఫ్యూచీ అనే అగ్నిదేవత అని కొందరు జపనీయులు విశ్వసిస్తారు. భూకంపాల వల్ల ఫ్యూజి పర్వతం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్యూజి విస్పోటనం

దాదాపు 300 సంవత్సరాల క్రితం 1707–1708 మధ్య కాలంలో ఫ్యూజి షేక్ అబ్దుల్ హకీం జాని అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది తన భీకర రూపాన్ని ప్రపంచానికి చూపించింది. దాదాపు 17 విస్ఫోటనాలు జరిగి విపరీతమైన బూడిదను విరజిమ్మింది. ఆ బూడిద 100 కి.మీ. దూరంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యో వరకు పడిందంటే అది ఎంత భీకరమైన పేలుడో సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు.
ఆ తరువాత ఇటువంటి విస్ఫోటనాలు జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఫ్యూజి అగ్నిపర్వతం నిద్రాణ స్థితిలో ఉంది. ఆ కారణంగా పర్యాటకులు నిర్భయంగా ఈ పర్వతాన్ని అధిరోహిస్తున్నారు.
అయిదు సరస్సులు

వందలాది సంవత్సరాల క్రితం లావా ప్రవాహాల ద్వారా ఈ ప్రాంతంలో అయిదు సరస్సులు ఏర్పడ్డాయి. వాటి పేర్లు కవాగుచికో సరస్సు, యమనకాకో సరస్సు, సైకో సరస్సు, షోజికో సరస్సు, మోటోసుకో సరస్సు. వీటిలో సైకో, షోజికో, మోటోసుకో అనే మూడు సరస్సులు ఇప్పటికీ భూగర్భ జలమార్గాల ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి.
అయిదు సరస్సుల్లో అతిపెద్దది యమనకాకో సరస్సు. ఈ అయిదు సరస్సు లలోకెల్లా అత్యంత సులభంగా చేరుకోదగినది కవాగుచికో సరస్సు. దీని చుట్టుకొలత సుమారు 13 కి. మీ. ఉంటుంది. కొన్ని సరస్సుల్లో అరుదైన హంసలను పోలిన పక్షులు కనిపిస్తాయి.
ఎనిమిది శిఖరాలు
ఓషైదాకే, ఇజుడాకే, జోజుకే, కొమగటకే, ముష్మితకే, కెంగామైన్, హుకుసందకే, కుసుషిడాకే ఇత్యాది ఎనిమిది శిఖరాలు ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి.
Mount Fuji : ఫ్యూజి అధిరోహకులు

అనేకమంది ఫ్యూజి పర్వతాన్ని అధిరోహించారు. క్రీ.శ. 663లో ఒక బౌద్ధ సన్యాసి తొలిసారిగా ఫ్యూజి పర్వతాన్ని అధిరోహించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత అనేకమంది పురుషులు నిరంతరం శిఖరాన్ని అధిరోహించారు. మహిళలు మౌంట్ ఫ్యూజి అధిరోహించడానికి 1912 వరకు అనుమతించలేదు. వారు అధిరోహించకూడదని నిషేధంలో ఉండేది. ప్రస్తుతం ఇటువంటి నిషేధాలు లేవు. అనేకమంది మహిళలు ఫ్యూజి పర్వతాన్ని అధిరోహిస్తున్నారు.
ఈ పర్వతాన్ని అధిరోహించాలని ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. యోషిదా, ఫుజినోమియా, గోటెన్బా అనే నాలుగు ప్రధాన మార్గాల ద్వారా పర్వతారోహకులు ఫ్యూజిని అధిరోహించారు. ఫుజినోమియా అనే మార్గం రెండవ స్థానంలో ఉంది. ఈ మార్గం కొంత నిటారుగా ఉంటుంది. అనుభవజ్ఞులైన పర్వతారోహకులు ఈ మార్గం ద్వారా ఫ్యూజి పర్వతాన్ని అధిరోహించడానికి ఇష్టపడతారు. పైగా ఫుజినోమియా మార్గం ద్వారా ఫ్యూజి శిఖరాన్ని ఇతర మార్గాలతో పోల్చుకుంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

ప్రధానంగా జులై 1 నుండి సెప్టెంబరు మధ్య అధిరోహించడానికి అనువైన సమయం. ఆ సమయంలో మంచు ఉండదు. అధిరోహించడానికి అనుమతి కూడా అప్పుడే లభిస్తుంది. ఫ్యూజి పర్వతం అధిరోహించడం అంత సులభమైన పని కాదు. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. ఫ్యూజి శిఖరం అధిరోహించడానికి 4 నుండి 8 గంటల సమయం పడుతుంది.
పర్వతారోహణ చేసేటప్పుడు చలికి తట్టుకోవడానికి ప్రత్యేకమైన దుస్తులు, ఇతర సామగ్రి అద్దెకు ఇస్తారు. అధిరోహకులు సాధారణంగా తెల్లవారుజామున శిఖరానికి చేరుకొని సూర్యోదయం చూడటానికి రాత్రిపూట బయలుదేరుతారు. రాత్రిపూట ఫ్యూజి పర్వతాన్ని అధిరోహించేటప్పుడు తలపై బ్యాటరీ దీపాలను ధరిస్తారు. ఆ వెలుగులో దారిని చూస్తూ వెళతారు. కొన్ని సందర్భాలలో పొగమంచు వల్ల దారి కూడా కనిపించదు.
ఫ్యూజి పర్వతంపై నుండి సూర్యోదయం తిలకించాలనుకున్నవారు ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్ర గుడారాలలో రాత్రి వేళలో బస చేసే సౌకర్యం ఉంది. పలుచోట్ల ప్రాథమిక చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం అయిదు లక్షల మంది ప్రజలు, పర్యాటకులు ఈ శిఖరాన్ని అధిరోహిస్తున్నారు. వీరిలో 30 శాతం మంది విదేశీయులు కాగా, 70 శాతం మంది జపాన్ వాసులు.(Mount Fuji)