Mother’s Love : అమ్మాపురం అనే చిన్న గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పార్వతమ్మ, ఆమె అప్పు కొడుకు గణేశ్ ఉండేవారు. పార్వతమ్మకు గణేశ్ అంటే చాలా ఇష్టం. చాలా గారాబం(affection), ప్రేమతో పెంచింది. తన కొడుకుని గొప్ప స్థానంలో చూడాలని పెద్ద చదువులు చదివించింది. గణేశ్ బాగా చదువుకుని, ఉద్యోగం సంపాదించాడు.
పార్వతమ్మ “నా కొడుకు ఇప్పుడు ఒక స్థాయిలో వున్నాడు. ఇక వీడికి పెళ్లి చెయ్యాలి” అని నిర్ణయించుకొని స్వాతి అనే అమ్మాయితో కొడుకు వివాహం చేసింది. వీరిద్దరూ రోజూ ఉద్యోగానికి వెళ్లేవారు. కొన్ని రోజులకు వారికి ఒక కూతురు, కొడుకు పుట్టారు. గణేశ్, స్వాతి రోజూ ఆఫీసుకు వెళ్లడంతో పిల్లలను పార్వతమ్మే చూసుకునేది.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. రోజు రోజుకి పార్వతమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్నందువల్ల స్వాతి ఉద్యోగం మానేసింది. మరికొద్ది రోజులకి పార్వతమ్మకు జ్వరం వచ్చి దగ్గు మొదలైంది. అది గమనించిన స్వాతి తన పిల్లలను పార్వతమ్మ దగ్గరకు వెళ్లకుండా చూసుకునేది. పార్వతమ్మను పట్టించుకొనేది కాదు, తనకి అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు. గణేశ్ కూడా తన తల్లి పిలిచినా పలకకుండా వెళ్లిపోయేవాడు.
ఒకరోజు స్వాతి తన భర్తతో “మీ అమ్మ వల్ల మనకు ఏం ఉపయోగం లేదు. పైగా తన ఆరోగ్యం బాగా లేనందువల్ల మనకే ఖర్చవుతోంది. అందుకని మీ అమ్మను నువ్వే వృద్ధాశ్రమంలో చేర్పించు” అంది. “నేను కూడా అదే ఆలోచిస్తున్నాను” అన్నాడు గణేశ్.
మరుసటి రోజే గణేశ్ పార్వతమ్మ దగ్గరకు వెళ్లి “అమ్మా! నేను నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలను కుంటున్నాను, త్వరగా బయలుదేరదాం” అని చెప్పాడు. కొడుకు మాటలు విన్న పార్వతమ్మ లోలోపల కుమిలిపోతూ కన్నీళ్లు కారుస్తుంది. పార్వతమ్మ తన సంచి సర్దుకుని, వెళ్లేముందు తన మనవడిని, మనవరాలిని చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది.
అలా వృద్ధాశ్రమంలో పార్వతమ్మను వదిలేసి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి రాబోయాడు గణేశ్. ఇంతలో ఆశ్రమంలోని ఒక పనివాడు “పార్వతమ్మగారూ! మీరేంటి ఇక్కడ ఆశ్రమం చూడటానికి వచ్చారా?” అని అడిగాడు. ఆ మాటలకు పార్వతమ్మ నవ్వి “నేను ఇక్కడే మీతో పాటు ఉండడానికి వచ్చాను” అని చెప్పింది.
వీరిద్దరి సంభాషణ గమనించిన గణేశ్ పనివాడి దగ్గరకు వెళ్లి ఆమె మీకు తెలుసా? అని అడిగాడు. అప్పుడు పనివాడు “తెలుసు.. పార్వతమ్మ ఒకప్పుడు ఇక్కడే పని చేసేది. ఆ సమయంలో ఒక ముసలావిడ తన మనవడితో ఇక్కడికి వచ్చింది. ఆ ముసలావిడ కొద్ది రోజులు ఆశ్రమంలో ఉండగానే చనిపోయింది. తన మనవడు అనాథ అయ్యాడు. అప్పుడు పార్వతమ్మ ఆ పసివాడిని తీసుకొని వెళ్లిపోయింది. ఈ పసిపిల్లవాడు అనాథ కాకూడదని నేను తీసుకెళ్తున్నాను” అని పార్వతమ్మ ఆ రోజు చెప్పింది. ఆ పసివాడిని పెంచి పెద్ద చేసి గొప్పవాణ్ణి చేసింది. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి అందరినీ పలకరించి వెళ్లేది. అంత మంచావిడను ఇప్పుడు ఆ పెంచుకున్న కొడుకే ఇక్కడ వదిలేసి వెళ్లాడు. పాపం కదా!” అన్నాడు పనివాడు.
నిజం తెలుసుకున్న గణేశ్ తన తల్లి దగ్గరకు వెళ్లి పాదాలపై పడి ఏడ్చాడు. క్షమాపణ చెప్పి తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రపంచంలో దేనికైనా వయస్సు అయిపోతుంది. కానీ తల్లిప్రేమకు కాదు. వయసు అయిపోయినంత మాత్రాన తల్లిని దూరం చేయకండి. ఎందుకంటే దేనినైనా సంపాదించవచ్చు కానీ తల్లిప్రేమను సంపాదించలేం.(Mother’s Love)