📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Lord jagannath: పురుషోత్తమ ధామం….పూరీ జగన్నాధం

Author Icon By Digital
Updated: August 18, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Lord jagannath: మన దేశం భిన్న సంస్కృతులకు భిన్న సంప్రదాయాలకు నిలయం. మన భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. భగవంతుని ఆరాధించడంలో కూడా. అదే కనపడుతుంది. చరాచర సృష్టికర్త, ఆద్యంతాలు లేని నిరాకారుడైన సర్వాంతర్యామికి వివిధ ప్రాంతాలలో ఆలయాలను నిర్మించి పూజించడం ఎన్నో వందల సంవత్సరా లుగా జరుగుతున్నదని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి. ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అవి ఆలయ నిర్మాణం, క్షేత్ర ప్రాధాన్యం, వెలిసిన దేవర రూపం, అక్కడ జరిగే ఉత్సవాలు అవే పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత కలియుగంలో మాత్రం విగ్రహారాధనకు అగ్రస్థానం అందించారు. దానికి కారణాలు అనేకం.
ఇవన్నీ కలబోసి మరికొన్ని జత చేసి చూస్తే కనిపించే క్షేత్రం పూరీజగన్నాథ్.

క్షేత్ర గాథ
ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద పద్మ, స్కంద కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్థాపన ఉన్నది. ఋగ్వేదంలో “పురుష మందాన” అని పేర్కొనబడినట్లుగా తెలుస్తోంది. పురుష మందాన కాలక్రమంలో ‘పురుషోత్తమ పురి’గా మారి ఇప్పుడు ‘పూరీ‘ అని పిలవబడుతోంది. పురుషుడే పురుషోత్తముడయ్యారు ఆయనే జగన్నాథుడు(Lord jagannath). తొట్టతొలి ఆలయం ఎవరు నిర్మించారన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశం రాజులు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారుల ఏకాభిప్రాయం. అగ్రజుడు, సోదరితో శ్రీ జగన్నాథుడు. నీలాచలం అనే పర్వతం మీద కొలువు తీరిన పూరీ మందిరం ఇంద్రద్యుమ్యుడు అనే రాజు నిర్మించినట్లు తెలుస్తోంది..

బ్రహ్మ విరచిత గాథ
యుగాల క్రితం సర్వలోక రక్షకుడు అయిన శ్రీహరి సాగర తీరాన జగన్నాథుడు(Lord jagannath) నీల మాధవునిగా కొలువై ఉండేవారట. దివ్యకాంతులు వెదజల్లే ఆ అర్చనామూర్తి దర్శనంతోనే సకల పాపాలు తొలగిపోయేవి, నరకం వెళ్లే వారు తగ్గిపోయారట. ఆందోళన చెందిన యమధర్మరాజు పరమశివుని ప్రార్థించి ఆ దివ్య మంగళ రూపాన్ని భూస్థాపితం చేశారట. ఆనతి కాలంలోనే అక్కడ ఒక పర్వతం ఏర్పడింది.. అదే నీలాచలం చేసిన వాగ్దానం భంగం చేయడం వలన దేవశిల్పి విశ్వకర్మ వేశారు. అభయ, వరద హస్తాలు లేవు కనుక భక్తులు మాత్రమే దర్శన మాత్రాన ముక్తిని పొందుతారని అంటారు. ఈ నీలాద్రి పర్వతం ఉన్న ఈ పురుషోత్తమ పూరీ మహిమాన్విత క్షేత్రంగా భక్తులకు ఇహ, పర సుఖాలను ప్రసాదిస్తుంది. ఈ మూడు రూపాలు పరమాత్మ అయిన వాసుదేవునికి, ఆయన వ్యూహ రూపమైన సంఘర్షణ (బలదేవుడు), ఆయన యోగమాయ అయిన సుభద్ర నాలుగవది సుదర్శన చక్రం. శ్రీవారి వైభవానికి చిహ్నాలు, అని విగ్రహాల రూప విశేషాల గురించి వివరించారట విరించి. క్షేత్ర మహాత్యాన్ని వివరించిన తరువాత విధాత స్వయంగా విగ్రహ ప్రతిష్ట చేశారట. అలా హంసవాహనుని చేతుల మీదుగా ద్వాపర యుగ తొలినాళ్లలో పురుషోత్తమ పురి శంఖుస్థాపన జరిగినట్లుగా క్షేత్రగాథ తెలుపుతోంది.

ఆలయ నిర్మాణ శైలి

భారతదేశంలో ముఖ్యంగా నాలుగు రకాల ఆలయ నిర్మాణాలు కనిపిస్తాయి. అవి నగర, వాసర, ద్రవిడ, గదగ్. కానీ ఉత్కళ దేశ ఆలయ నిర్మాణాలు కొంత వరకు నగర శైలిలో నిర్మించబడినా పూర్తిగా కాదు. అందుకే ఉత్కళ శైలి అని పిలుస్తారు. ఇందులో కూడా ఒక ఆలయం నుండి. మరో ఆలయానికి కొంత నిర్మాణ వత్యాసం కనిపించడం ప్రత్యేకం.

ఆలయ విశేషాలు

పేరుకి శ్రీ జగన్నాథ క్షేత్రం(Lord jagannath) అయినా వినాయకుడు, దుర్గ, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, పార్వతి, శక్తి, సతీదేవి కొలువైన ఏకైక క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దైవాలైన శ్రీ జగన్నాథ, శ్రీ బలభద్ర, శ్రీ సుభద్రలు ప్రధాన ఆలయంలో రత్నవేదిక (రత్న భేది) పైన దర్శనమిస్తారు. పూర్తిగా ఉత్కళ నిర్మాణ శైలిని ప్రదర్శించే సుందర నిర్మాణమైన ఈ ఆలయంలో అనేక ఇతర దేవీ దేవతల సన్నిధులతో పాటు ఆలయ పాకశాల, నబకళేబర దహనశాల ఉంటాయి. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రాకారం నిర్మించబడింది. నాలుగు దిక్కులా ద్వారాలు నిర్మించారు.ప్రధాన ద్వారాన్ని సింహ ద్వారం అని అంటారు. మిగిలిన మూడు దిక్కుల ఉన్న హతీ అశ్వ, వ్యాఘ్ర ద్వారాలు అని పిలుస్తారు. మధ్యలో రెండు వందల అడుగుల ఎత్తైన విమాన గోపురంతో ఎదురుగా ఇంకా ఎత్తైన రాతి ధ్వజస్థంభం కనపడతాయి. తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి వెలుపల ప్రధాన ద్వారానికి వెలువల పదహారు ముఖాల ఏక శిలా నిర్మితమైన అరుణ స్థంభం కనపడుతుంది.
పైన సూర్యదేవుని రథసారథి అయిన అరుణుడు ఉపస్థితులై ఉంటారు. సింహ ద్వారం నుండి ప్రాంగణం లోపలికి ప్రవేశించగానే ఎత్తైన మెట్ల మార్గం ఆలయానికి చేరుస్తుంది.
ఈ మెట్లకు విశేష ప్రాధాన్యత ఉందని విశ్వసిస్తారు. భక్తులు. ఒక్కో మెట్టు డెబ్బై అడుగుల వెడల్పు ఉంటాయి. ఇరవై రెండు మెట్లు మానవులకు గల చెడు లక్షణాలు అయిన అహంకారం, అసూయ, లోభం, మోసం, మోహం, క్రోధం లాంటి వాటికి ప్రతీకగా పేర్కొంటారు రథయాత్ర సమయంలో మూలమూర్తులు ఈ మార్గం గుండానే రథాలను చేరుతారు. జగన్నాథ దర్శనఫలం దక్కాలి అంటే దుర్వ్యసనాలను వదిలి కన్నవారిని, తోడపుట్టిన వారిని ఆదరించాలి అన్న జీవిత సత్యాన్ని ఈ మెట్లు తెలుపుతాయి.


ఈ ప్రాంగణంలో సుమారు వందకు పైగా ఉపాలయాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి శ్రీ కంచి గణేష్, శ్రీ సూర్య, శ్రీ మహాలక్ష్మి. శ్రీ నరసింహ, శ్రీరామ, శ్రీ హనుమ, శ్రీ విమల, శ్రీ శనేశ్వర సన్నిధులు ముఖ్యమైనవి, గజపతి పురుషోత్తమ దేవ కంచి రాజకుమారిని వివాహం చేసుకొన్న సందర్భంలో కంచిరాజు అల్లునికి గణపతి విగ్రహాన్ని బహుకరించారట. శ్రీ నరసింహస్వామిని ఇంద్రద్యుమ్య రాజు ద్వాపర యుగంలో ప్రతిష్ఠించారు.
మహాశక్తి పీఠం దక్షవాటికలో జరిగిన అవమానానికి యజ్ఞ గుండంలో తనువు దాలించిన సతీదేవి శరీరాన్ని శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రంతో ఛేదించారు. ఆ శరీర ఖండాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధికెక్కాయి. శ్రీ జగన్నాథ మందిరంలో ఉన్న శ్రీ విమలాదేవి కొలువైన ప్రదేశంలో సతీదేవి పాద భాగాలూ పడటం వలన ఈ సన్నిధి మహా శక్తి పీఠంగా విరాజిల్లలతోంది. అమ్మవారు శాంత ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. అశ్వీజ మాసంలో మహాలయ ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు విశేష పూజలు చేస్తారు. విజయదశమి ముగిసిన తరువాత జరిగే పోదశ దినాత్మక అని పిలిచే పదహారు రోజుల పండుగ శ్రీ విమలాదేవి సన్నిధిలో జరిగే మరో ప్రత్యేక ఉత్సవం, శ్రీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక సమావేశాల కోసం ఆలయ ఉత్సవాలు నిర్వహించడానికి అనేక మండపాలు నిర్మించారు. ఇవన్నీ చక్కని స్తంభాలతో ఎత్తైన గద్దెతో నిర్మించబడ్డాయి.

రత్నభేది

జగన్మోహన, నాట్య మండపం, భోగమండపం దాటి వెళితే వచ్చే గర్భాలయంలో ‘రత్న బేది’గా పిలవబడే ఎత్తైన గద్దె మీద శ్రీ జగన్నాథ. శ్రీ బలభద్ర, అన్నల మధ్య సుభద్ర వర్ణనాతీతమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.
ప్రధాన అర్చనమూర్తులతో పాటు విశ్వకర్మ తయారు చేసిన దారు సుదర్శన చక్రం శ్రీ మదన మోహన శ్రీదేవి శ్రీ విశ్వదాత్రి కొలువై ఉంటారు.

మహాలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీవారి నివేదన

ఈ ఆలయంలో మరో విశేష ప్రదేశం పాఠశాల. జగన్నాయకుడు కొలువైన వూరీ సందర్శన మనోభీష్టాలను నెరవేర్చేది. స్వామివారి అన్నప్రసాద సేవన సర్వ పాపహరణం. ‘మేఘానంద ప్రాకారం’ లో ఉన్న రసోయి మరో (పాఠశాల)లో నవనీత చోరుని నివేదన నిమిత్తం నవకాయ పిండి వంటలు మందిరరాణి శ్రీ మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతాయి. రోజులో అయిదు సార్లు మూలవిరాట్టులకు, పరివార దేవతలకు నివేదనలు పెడతారు. వాటిలో మధ్యాహ్నం ‘కోతో భోగో లేదా. అబద’ ముఖ్యమైనది. అన్నం. కూరలు, పప్పు, పచ్చడి, పాయసం లాంటివి ఈ నివేదనలో ఉంటాయి. మహాప్రసాదంగా పిలవబడే ఈ నివేదనలో సమర్పించే యాభై ఆరు రకాల వంటలను ప్రాంగణంలో వున్న గంగ, జమున అని పిలిచే పవిత్ర బావుల నీటితో తయారు చేస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మరెక్కడా చూడని విధానంలో ఉంటుంది. ఏడు కుండలను ఒకదాని మీద ఒకటి పేర్చి పొయ్యి పైన ఉంచుతారు. చిత్రంగా అన్నిటికన్నా పైన ఉన్న చిన్న కుండలోని పదార్థాలు ఉడుకుతాయి. చివరగా అన్నిటికన్నా కింద ఉన్న పెద్ద కుండలోని పదార్థాలు ఉడుకుతాయి. వంటలో ఏ విధమైన అపవిత్రత తొంగిచూసినా వంటశాల వెలుపల కుక్క తాలూకు నీడ కనపడుతుందట. దాంతో శ్రీ మహాలక్ష్మి ఆగ్రహం చెందిందని భావించి వండిన పదార్థాలను భూస్థాపితం చేసి తిరిగి వంట చేస్తారు.
ఆలయ పండాలు వంటకాలను కావడిలో పెట్టుకొని ప్రత్యేక మార్గంలో భోగ మండపం చేరుస్తారు. నివేదన తరువాత అధిక శాతం మహాప్రసాదాన్ని ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న ‘ఆనంద బజార్’ కి పంపుతారు. అక్కడ. ప్రజలు మహాప్రసాదాన్ని మహదానందంతో కొనుగోలు చేస్తారు. ఈ ప్రసాద పంపిణీలో ఎలాంటి నిబంధనలు ఉండవు. అందుకే సర్వం జగన్నాథం అంటారు. వండిన మహా ప్రసాదం ఏ రోజు కూడా మిగలక పోవడం మరింత ప్రత్యేకం.
శ్రీ జగన్నాథుడు కొలువైన శ్రీమందిరం అనేక ప్రత్యేకతలు, విశేషాలకు కేంద్రం. ఆలయ విమాన శిఖరాన కనిపించే అష్ట ధాతువులతో చేసిన వెయ్యి కిలోల బరువు ఉండే ‘నీల చక్ర’ (సుదర్శన చక్రం) ఆ రోజులలో అంత పైకి ఎలా చేర్చారన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది.
మనం ఏ దిక్కు నుండి చూస్తే సుదర్శన చక్రం ఆ వైపు తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆలయ విమాన గోపురం పైన కట్టిన జెండాను ఒక పండా ఎలాంటి రక్షణ లేకుండా చేతులతో ఎక్కి మార్చడం మరో విశేషం. అలా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఆలయం మూతపడుతుందని ఆలయ మదాల పంజిలో పేర్కొన్నట్లుగా చెబుతారు.
శ్రీ మందిరం పైన విమానాలు కాదు కదా పక్షులు కూడా ఎగరవు, ఆలయ నీడ ఏ సమయంలో కూడా కనపడదు. అదే విధంగా ఆలయంలో సముద్ర ఘోష వినపడదు. వీటన్నింటి కన్నా ముఖ్యమైన విశేషాలు మరో రెండు ఉన్నాయి. అవి నవకళేబర, రథయాత్ర. మరే ఇతర క్షేత్రంలో కనపడనివి ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఇవన్నీ ఎలా సాధ్యం? తరాలు మారినా ఆచారాలు విధానాలు పద్ధతులు మారక పోవడానికి కారణం ‘మదాల వంజి’.

మదాల పంజి

ఆలయ సంఘటనల సంకలన పుస్తకం అని చెప్పవచ్చు. గంగ వంశ రాజులా పాలనా కాలంలో మదాల పంజిని భవిష్యత్తరాల వారి కోసం ఏర్పాటు చేసారని శాసనాల ద్వారా తెలుస్తోంది. నాటి పాలకులు ముందు తరాల వారికి ఆలయ నిర్వహణ గురించిన సమగ్ర సమాచారం అందించడానికి ఆలయ చరిత్రలోని ముఖ్య ఘట్టాల వివరాలు తెలుపడానికి ఎంచుకొన్న మార్గం. ప్రతి విజయదశమికి ఆ సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను ఇందులో రాస్తారు. మదాల వంజిలో రాయడానికి, తప్పొప్పులు సరిచేయడానికి అనుసరించడానికి, వివరించడానికి, భద్రపరచడానికి అయిదుగురు ‘కరణాలు’ నియమించబడ్డారు, దీనిలో నాలుగు భాగాలు ఉంటాయి. రాజ ఖంజ, రాజ్య ఖంజ, కర్మాంగి, దిన పంజి. ఈ నాలుగు భాగాల ద్వారా నేటికీ ఆలయంలో అన్ని పురాతన సంప్రదాయాలను అనుసరించడం జరుగుతోందనుకోవచ్చు.]

ఆలయ ఉత్సవాలు

శ్రీ జగన్నాథ మందిరం ఎన్నో ప్రత్యేక విశేష ఉత్సవాల కేంద్రం, నిత్య పూజలతో పాటు నెలకొక ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన ఆలయంలో ఆయన నిర్ణయించిన మేరకు సంవత్సరంలో పన్నెండు ఉత్స వాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. స్నాన యాత్ర, రథ యాత్ర, శయన యాత్ర, ఉత్తరాయణ, దక్షిణాయన, పార్శ్వ పరివర్తన, ఉత్థాపన, ప్రవరణ పుష్యాభిషేక, డోలా యాత్ర, దమనక భజన, అక్షయ తృతీయ, చందన యాత్ర, నీలాద్రి, మహోదయ, నవకళేబర ఇవి కాకుండా మరెన్నో చిన్న చిన్న ఉత్సవాలు జరుపుతారు.

నవ కళేబర

ఏ దేవాలయంలో అయినా ఒకసారి ప్రతిష్ఠించిన అర్చనా మూర్తిని మార్చడం జరగదు. అరుదైన పరిస్థితులలో మాత్రమే అలాంటిది చోటు చేసుకొంటుంది. కానీ అనేక విశేషాల

నిలయమైన శ్రీ జగన్నాథ మందిరంలో పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాడ మాసం వచ్చిన సంవత్సరం ‘నవ కళేబర’ పేరుతో ఈ మార్పు జరుగుతుంది. శ్రీ జగన్నాథ. శ్రీ బలభద్ర, శ్రీ సుభద్ర మూర్తులు దారు శిల్పాలు అనగా వేపచెట్టు కాండంతో తయారు చేసినవి. ఈ ఆచారం రావడానికి ప్రధాన కారణం యుద్ధాలు ఏడవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు చేసిన దాడి మొట్టమొదటిదిగా ఆలయ వంజి తెలుపుతోంది. అది మొదలు ఎన్నో దాడులు పూరి ఆలయం మీద జరిగాయి. ఎంతో సంపద దోచుకోవడం జరిగింది. ఆంగ్లేయులు ఓద్ర దేశాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నాక ఈ దాడులు ఆగిపోయాయి. వారు స్థానిక ప్రజల భక్తి విశ్వాసాలను అర్ధం చేసుకొని ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి స్థానిక హిందూ వ్యక్తిని నియమించారు. దాడులు జరిగినప్పుడు విగ్రహాలను రహస్య ప్రదేశాలకు తరలించడం జరిగేది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తరువాత ఆర్చనమూర్తులను రత్న బేది పైన తిరిగి ప్రతిష్టించడం చేసేవారు. ఈ క్రమంలో విగ్రహాలకు నష్టం జరిగేది ఈ కారణంగా విగ్రహాలను మార్చడం అనివార్యం కావడంతో ‘నవ కళేబర యాత్ర’ను ప్రవేశపెట్టారని చరిత్రకారుల అభిప్రాయం. సబరుల సంతతికి చెందిన దైతపతుల ఆధ్వర్యంలో నియమించబడిన బృందం నిర్ణయించిన విధానం మేరకు పూజాదులు నిర్వహించి తగిన వృక్షాల కోసం అన్వేషణ చేస్తారు. ఎంచుకొన్న వృక్షానికి పూజలు చేసి ఆలయానికి తరలిస్తారు. అనేక సంప్రోక్షణల తరువాత నిపుణులైన శిల్పులు విగ్రహాలుగా మలుస్తారు. రథయాత్రకు తయారు చేసే రథాల కలపను ఎలాంటి ప్రక్రియ అనుసరిస్తారో అదేవిధంగా ఈ నవకళేబరకు కూడా అనుసరిస్తారు. పాత విగ్రహాలను ప్రత్యేక మరుభూమిలో పాతి పెడతారు.

బ్రహ్మ పరివర్తన వేడుక

పాత విగ్రహాల నుండి సేకరించిన బ్రహ్మ పదార్థాన్ని నూతన దారు విగ్రహాల లోనికి మార్చే ప్రక్రియను ‘బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు. తొలగించిన విగ్రహాల నుండి సేకరించిన బ్రహ్మ పదార్థాన్ని కండ్లకు గంతలు కట్టుకొన్న ప్రధాన అర్చక పండా నిర్వహిస్తారు. తాను తన హస్తాల ద్వారా మార్చే బ్రహ్మ పదార్థం ఏమిటన్నది ఆయనకు కూడా తెలియక పోవడం దైవశక్తికి నిదర్శంగా పేర్కొంటారు. బ్రహ పదార్థ మార్పిడి తరువాతనే నూతన విగ్రహాలు పూజార్హమవుతాయి. రత్న భేది పైన కొలువైన నూతన అర్చనామూర్తుల దర్శనాన్ని ‘నాగార్జున బేష’ అని పిలుస్తారు.

మనందరికీ తెలిసి చందన యాత్ర సింహాచలంలో కొలువు తీరిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి జరుపుతారు. సంవత్సరం అంతా చందన కప్పుతో ఉండే సింహాచలేశ్వరునికి అక్షయ తృతీయ నాడు తొలగించి, భక్తులకు శ్రీవారి నిజరూవ సందర్శనానుగ్రహం కలిగిస్తారు. తిరిగి అంచెలు అంచెలుగా స్వామివారిని చందనంతో కప్పడం చేస్తారు.
అదే అక్షయ తృతీయ నాడు పూరిలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామికి చందనాభిషేకం చేయడాన్ని ‘చందన యాత్ర’ అని పిలుస్తారు. నలభై రెండు రోజుల పాటు జరిగే సుదీర్ఘ ఉత్సవం చందన యాత్ర.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయనాడు ఏ శుభకార్యం మొదలు పెట్టినా అది అక్షయంగా మారుతుంది. శుభ ఫలితాలను పొందవచ్చని విశ్వాసం. ఈ నమ్మకానికి మూలం ఆ రోజునే చిన్ననాటి మిత్రుడు కుచేలుని నుండి గుప్పెడు అటుకులు స్వీకరించి అంతులేని సంపదను అనుగ్రహించారు శ్రీకృష్ణ పరమాత్మ. దశావతారాలలోని శ్రీ పరశురామ, శ్రీ బలరాములు జన్మించినది. అక్షయ తృతీయనాడే! మహాభారత రచనను శ్రీ వ్యాస భగవానులు పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే ప్రారంభించారు. అన్ని వైష్ణవ ఆలయాలలో అక్షయ తృతీయనాడు శ్రీ లక్ష్మీ నారాయణులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

బాహార యాత్ర

చందన యాత్ర రెండు భాగాలుగా జరుపుతారు. బాహార, బిత్తర (లోపల) యాత్ర. బాహార యాత్రను ప్రజలందరి సమక్షంలో ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో నరేంద్ర సరోవరంలో నిర్వహిస్తారు. ముందురోజు భక్తిశ్రద్ధలతో గంధపు చెక్కల నుండి చందనాన్ని తయారు చేస్తారు. మరునాడు ఉదయపు ఆరగింపు తరువాత ప్రధాన అర్చక పండా చందన పాత్రతో రత్న బేది చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆప్యాయంగా చందనాన్ని విగ్రహ శరీర భాగాలకు లేపనం చేస్తారు. మధ్యాహ్నం నివేదన తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ మదనమోహన ఉత్సవ మూర్తులను రత్న భేది పైన ఉంచే ప్రత్యేక పూజలు చేస్తారు.

ప్రధాన పండా ఏకాంతంగా స్వామివారిని చందాన యాత్రకు, రాబోయే రథయాత్రకు అనుమతి కోరుతారు. లభించిన అనుమతిని లేఖ రూపంలో ఉంచి చందనయాత్ర సంబరాలను అట్టహాసంగా ప్రారంభిస్తారు. శ్రీకోవెల నుండి నరేంద్ర సరోవరం వరకు రహదారులను జగన్నాథుని రాక కోసం పుష్పాలు, అరటి మండపాలలో సుందరంగా అలంకరిస్తారు. దారికి ఇరుపక్కలా భక్తులు నల్లనయ్యకు ఎండ వేడి సోకకుండా ఛత్రాలను పట్టుకొని నిలబడతారు. తెలుపు, ఎరుపు వస్త్రాలు, పుష్ప మాలలతో అందంగా అలంకరించిన పల్లకీలలో శ్రీ దేవి, భూదేవి దేవి సమేత శ్రీ మదనమోహన స్వామి, శ్రీరామ, శ్రీకృష్ణ, లోకనాథ, మార్కండేశ్వర, కపాల మోచన, జంబేశ్వర, నీలకంఠ అనే పంచ పాండవ లింగాలను ఉంచి మేళతాళాలు, భజనలు, కీర్తనలతో స్తుతిస్తూ నరేంద్ర సరోవరానికి చందన యాత్ర బయలుదేరుతుంది.

నరేంద్ర సరోవరం

పూరీని పాలించిన కపిలేంద్ర దేవ మహారాజు పుత్రుడైన నరేంద్ర దేవ రాజకుమారుడు శ్రీ జగన్నాథుని పట్ల ఎంతో భక్తి

విశ్వాసాలు కలిగినవాడు. చందనయాత్ర నిర్వహించడానికి ఎనిమిది ఎకరాల విశాల సరోవరాన్ని నిర్మించారు. ఈ కారణంగా ఆయన పేరుతోనే పిలుస్తున్నారు. సరోవరం మధ్యలో ఉన్న చిన్న ఆలయం చేరుకోడానికి వంతెన నిర్మించారు.

రథానికి అనుమతి

పూరి రాజభవనం పేరు ‘శ్రీనార్’. నరేంద్ర సరోవరానికి వెళ్లే దారిలో ఉంటుంది. చందనయాత్రకు తరలి వెళుతున్న జగత్ప్రభువును పూరి మహారాజు సాంప్రదాయ బద్ధంగా సేకరించిన కలప శిల్పులు రథయాత్రకు కావలసిన రాథాల తయారీకి అనుమతి కోరుతారు. స్వామి తమ అంగీకారం తెలిపిన తరువాత కలపకు పూజలు చేసి రథాల నిర్మాణానికి స్వీకారం చుడతారు. సరోవరానికి చేరిన లోకనాథుని ” “భైర 20s. సునంద అనే నావలలో ఉపస్థితులను చేసి భక్తుల హర్షధ్వానాల మధ్య సరోవరంలో విహారం మొదలు పెడతారు. చీకటి పడేంత వరకు విహారం జరిపి స్వామి వార్లను సరోవరం మధ్యలో ఉన్న ఆలయానికి తరలించి, ఉపచారాలు చేసి మరోసారి అలంకరిస్తారు. అర్ధరాత్రి వరకు భక్తుల జయజయ ధ్వనుల మధ్య ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బాహార యాత్ర కొనసాగుతుంది. ఆఖరి రోజున మూల మూర్తులను స్నాన బేదికి తరలించి ప్రాంగణంలో ఉన్న ‘సోనా కువ’ (బంగారుబావి) నీటితో స్నాన యాత్ర నిర్వహిస్తారు. వేలాదిమంది భక్తులు ఆలయం వెలువల నిలిచి అపురూపమైన స్నాన యాత్రను వీక్షిస్తారు.

బిత్తర యాత్ర/అనావాస పట్టి

శ్రీ జగన్నాథ సంప్రదాయంలో బిత్తర యాత్ర ముఖ్య భాగం. వాతావరణం, అధిక జలక్రీడలు స్నానం వలన ఆదిదేవునికి శారీరక అస్వస్థత ఏర్పడుతుంది. ఈ కారణంగా బిత్తర యాత్ర సమయంలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. వెలుపల ఉన్న అనావాసర పట్టి అంటే చిత్రపటాలను మాత్రమే దర్శించుకొని అవకాశం ఉంటుంది. బిత్తర యాత్ర సందర్భంగా అస్వస్థతకు లోనైన మూలమూర్తులకు పథ్యపు ఆహార నివేదన చేస్తారు. ఆయుర్వేద వనమూలికలు ఫలాలు మాత్రమే ఉంటాయి. ఇరవై ఒక్క రోజుల బిత్తర యాత్ర సందర్భంగా మూగబోయిన పూరి ‘నవం ‘నవయవ్వన దర్శనం’ తో నూతన శోభను సంతరించుకొంటుంది.

నవ యవ్వన దర్శనం

అనారోగ్యంతో సేదతీరిన ఆదిదేవునికి స్నాన యాత్ర సందర్భంగా కళావిహీనం కావడంతో తిరిగి సుందరంగా తీర్చిదిద్ది రథయాత్రకు సిద్ధం చేసిన సందర్భంగా భక్తులకు లభించే అపూర్వ దర్శన ఈ నవ యవ్వన దర్శనం. అప్పటికి రథాలు యాత్రకు సిద్ధం అవుతాయి. విశ్రాంతి తీసుకొన్న సమయంలో తన అనారోగ్యం గురించి వేదన చెందిన ప్రజల వద్దకు పరమాత్మ స్వయంగా తరలివెళ్లే రథయాత్రకు అంతా సిద్ధం అవుతుంది.

రథయాత్ర

గర్భాలయం దాటి నగర విహారానికి వచ్చేది శ్రీ జగన్నాథ మందిరంలో తప్ప మరెక్కడా ఇలాంటి విశేషం కనపడదు. ఎన్నో ప్రత్యేక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో అత్యంత ప్రధానమైనది రథయాత్ర, పరంధాముడు స్వయంగా తన భక్తుల వద్దకు వెళ్లడం ఈ రథయాత్రలోని ప్రత్యేకత. శ్రీ జగన్నాథ స్వామి అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువైన ఏకైక ఆలయం పూరి క్షేత్రం. గర్భాలయ అర్చనామూర్తులు వేపచెట్టు కాండంతో చేయడం మూలవిగ్రహాలు కాళ్లు, చేతులు లేకుండా వుండటం ఎక్కడ లేని అద్భుతం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర గురించి స్కంద, బ్రహ్మ, పద్మ పురాణాలలో పేర్కొన్నారు. ఇక్కడ సోదరితో కలిసి చేసే రథయాత్రలో రథాలు ప్రతి సంవత్సరం కొత్తవి తయారు చెయ్యడం విశేషం.

గుండిచా మందిరం

శ్రీమందిరం నుండి శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళతారు. అక్కడ తొమ్మిది రోజులు గడిపి తిరిగి శ్రీక్షేత్రం చేరుకొంటారు.

నంది ఘోష: శ్రీ జగన్నాథుడు ప్రయాణించే రథాన్ని నంది

ఘోష అని పిలుస్తారు. నలభై నాలుగున్నర అడుగుల ఎత్తు, పదహారు చక్రాలు కలిగి ఉంటుంది. ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. తాళ ధ్వజ: నలభై మూడు అడుగుల ఎత్తైన తాళ ధ్వజను ఎరుపు, నీలి వస్తాలతో అలంకరిస్తారు. దర్పదళన: సుభద్రా దేవి ప్రయాణించే రథాన్ని దర్పదళన అని అంటారు. ఈ రథాన్ని నలుపు, ఎరుపు వస్త్రాలతో’ అలంకరిస్తారు. దర్పదళన చివరగా బయలుదేరుతుంది. రత్న బేది నుండి బలభద్ర, జగం సుభద్ర విగ్రహాలను సబర రాజు విశ్వావసు వంశానికి వంశానికి చెందినవారే వెలువకి తెచ్చే అధికారం కలిగి ఉంటారు. సుమారు వంద మంది చొప్పున అంచెలంచెలుగా ఒకో విగ్రహాన్ని నిర్దేశిత రథాల మీదకు చేర్చేటప్పటికీ సాయంత్రం అవుతుంది దేశ విదేశాల నుండి తరలి వచ్చిన లక్షలాది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. భక్తి గీతాలు, నామ సంకీర్తన, భజన కీర్తనలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోతుంటుంది. నలు దిశలా ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లుతుంటుంది.

ముగ్గురు ఆర్చామూర్తులు ఉపస్థితులైన తరువాత పూరీ రాజు విచ్చేస్తారు. స్వర్ణ పిడి కలిగిన చీపురుతో శుభ్రం చేసి కస్తూరి కళ్లాపి జల్లుతారు. హారతి ఇచ్చాక రథాలు గుండిచా మందిరానికి బయలుదేరుతాయి. మొదట నందిఘోష కదిలినా అగ్రస్థానం అగ్రజునిదే. మందు తాళ ధ్వజ, వెనుక దర్ప దళన

చివరగా నందిఘోష భక్తుల జయజయ ధ్వానాల మధ్య బయలుదేరిన రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి చేరేటప్పటికి మరుసటి రోజు తెల్లవారిపోతుంది. అప్పటికీ భక్తుల కోలాహలం రెండింతలు అవుతుంది. జగన్నాథుడు గుండిచా మందిరంలో బస చేసిన సమయంలో వంటశాల కూడా అక్కడికి చేరుకుంటుంది. శ్రీక్షేత్రంలో జరిగే విధంగా పూజాదికాలు నిర్వహిస్తారు. వాటిలో హేర పంచమి ఒకటి. అంటే అర్ధాంగి అలక, గుండిచా మందిరానికి చేరిన అయిదవ రోజున ఈ ఘట్టం జరుగుతుంది.. రథయాత్రకు బయలుదేరుతూ జగన్నాథస్వామి లక్ష్మీదేవికి నేను రేపటికల్లా తిరిగి వస్తాను అని చెప్పారట. అయిదు రోజులైనా స్వామివారి జాడ లేకపోవడంలో పరిచారికలను, భటులను నలుదిక్కులా పంపిస్తుంది అమ్మవారు. శ్రీవారు అన్న, చెల్లెలితో కలిసి గుండిచా మందిరంలో వున్నారన్న విషయం తెలుస్తుంది. ఆగ్రహంతో అమ్మవారు మందీ మార్బలంతో గుండిచా మందిరానికి వెళుతుంది. కానీ అక్కడి ద్వారపాలకులు ఆమెను లోపలికి వెళ్లనివ్వరు. తీవ్రమైన అసహనంతో అమ్మవారు శ్రీక్షేత్రానికి తిరిగి వెళుతూ కాలితో నందిఘోషను తన్నుతుంది, రథం తాలూకు చిన్న ముక్క విరిగి పడుతుంది. ఈ కారణంగానే రథయాత్ర ముగించుకొని తిరిగి శ్రీక్షేత్రానికి చేరిన స్వామి అమ్మవారిని ప్రసన్నం చేసుకోడానికి బాయిసి పహచ వద్ద స్తోత్రపాఠాలు చేస్తారు. ఈ ఘటాన్ని అర్చక పందాలు చక్కని హావభావాలతో ప్రదర్శిస్తారు.

బహుదా యాత్ర

తొమ్మిది రోజులు గుండిచా మందిరంలో సేద తీరిన జగన్నాథుడు దశమి నాడు శ్రీక్షేత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. దీనినే బహుదా యాత్ర అంటారు. స్థానికంగా ‘బావ’ అని అంటారు. దారిలో అర్ధపని ఆలయం వద్ద పినతల్లి యాభై రకాల తీపి పదార్థాలను రుచి చూస్తారు. అలిగిన లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి స్వాగతం పలకడం కొసమెరుపు. మూలవిరాట్టులు ఏకాదశినాడు రథాలలోనే గడుపుతారు. ఆరోజు అనేక స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. దీనిని ‘సోనా బేష’ అంటారు. దశమిరోజున తిరిగి మూలవిరాట్టులు రత్న బేదిపైన కొలువు తీరుతారు.

ప్రతిఒక్కరు జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ రథయాత్ర చూడాలని ఆశిస్తారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సుందర సాగర తీరంతో అత్యంత అరుదైన దైవ దర్శనంతో శారీరక, మానసిక ఆహ్లాదం పొందాలంటే తప్పక సందర్శించవలసిన క్షేత్రం పూరీ.

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Hindu Gods Indian Temples Jagannath bhajan Jagannath bhakti songs Jagannath Mandir Jagannath Puri Jagannath Puri live Jagannath Rath Yatra Jagannath Rath Yatra 2025 Jagannath Rath Yatra date Jagannath Rath Yatra news Jagannath Rath Yatra schedule Jagannath Temple Jagannath Temple history Jagannath Temple Odisha Jai Jagannath Jai Jagannath quotes Latest News in Telugu Lord Jagannath Lord Jagannath images Lord Jagannath Puri Lord Jagannath status Lord Jagannath wallpapers Lord Vishnu avatar Odisha Temple Puri Jagannath Temple images Puri Rath Yatra Rath Yatra 2025 Rath Yatra festival 2025 Rath Yatra live Rath Yatra live stream Rath Yatra Puri live Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.