Clever Farmer Story: మంగాపురంలో మంగయ్య అనే రైతు (Farmer) వుండేవాడు. ఒకరోజు రాత్రి అతని రెండు ఎద్దుల్లో ఒక ఎద్దుని ఒక దొంగ తీసుకెళ్లిపోయాడు. మంగయ్య ఎక్కడ వెతికినా తన ఎద్దు కనిపించలేదు. చేసేదేమి లేక ఇంకో ఎద్దుని కొందామని మంగయ్య సంతకి వెళ్లాడు. అక్కడ తన ఎద్దుని ఒకతను అమ్మకానికి పెట్టడం కనిపించాడు.
‘ఇది నా ఎద్దు. ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది?” అని మంగయ్య అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ దొంగ హడలిపోయి. బయటకు భయం కనపడనీయకుండా
‘ఇది నా ఎద్దే’ అని బుకాయించాడు. వాళ్ల చుట్టూ జనం పోగయ్యారు. మంగయ్యకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. తన భుజం మీద కండువా తీసి, ఎద్దు కళ్లకి కట్టి ‘నా ఎద్దుకి ఒక కన్ను మెల్ల వుంది. ఇది నీ ఎద్దు అంటున్నావు. దీనికి ఏది మెల్ల కన్నో నీకు తెలిసే వుంటుంది కదా. ఏది మెల్లకన్నో చెప్పు?’ అని సవాలు విసిరాడు. అతను దొంగతనం అయితే చేసాడు కాని దాని ముఖాన్ని పరిశీలనగా చూడలేదు. దానికి ఏది మెల్లకన్నో అతనికి అర్థం కాలేదు. ఏదో ఒకటి చెప్పకపోతే పోగయిన జనం చావగొడతారు. అందుకే లేని ధైర్యం తెచ్చుకొని ‘కుడికన్ను’ అన్నాడు. ‘సరిగ్గా ఆలోచించి చెప్పు. కుడి కన్ను కాకపోతే ఈ ఎద్దు నీది కాదు. నాది అవుతుంది’ అని మంగయ్య కంగారు పెట్టాడు. ‘వామ్మో, ఇదేమిట్రా దేవుడా. నేను మాట మార్చి ఎడమకన్ను అంటే, నీ ఎద్దు సంగతి నీకు తెలియదా? అని జనం నా భరతం పడతారు. దేవుడా కుడి కన్నే అయ్యేట్లు చూడు’ అని 3 మనస్సులో దేవుడికి దండం పెట్టుకొని ‘నా’ ఎద్దు సంగతి నాకు తెలియదా? ఖచ్చితంగా కుడి కన్నే మెల్ల కన్ను’ అన్నాడు దొంగ. ‘మహాజనులారా అంతా విన్నారుగా. ఇప్పుడు చూడండి, నా ఎద్దుకి మెల్ల కన్నే లేదు.
రెండూ మంచి కళ్లే’ అని మంగయ్య ఎద్దు కళ్లకి కట్టిన తన కండువా. విప్పాడు. నిజమే దానికి రెండూ మంచి కళ్లే వున్నాయి. చేసేదేమి లేక దొంగ అక్కడ్నుంచి పారి పోబోయాడు. జనం ఆ దొంగని చెట్టుకి కట్టేసి, పోలీసులకి కబురుపంపి, వచ్చిన పోలీసులకి ఆ దొంగని అప్పగించారు.
పోలీసులు మంగయ్య తెలివిని ఎంతో మెచ్చుకొని, మంగయ్య ఎద్దుని మంగయ్యకి అప్పగించారు. మంగయ్య తన ఎద్దు తనకు దొరికినందుకు, ఎంతో సంతోషించి, తన ఎద్దుతో తన ఇంటికి దారి పట్టాడు.