ఒంటరితనం ఓ మానసిక భావోద్వేగ ప్రక్రియ కొందరికి ఒంటరితనం లేదా ఏకాంతం ఓ అద్భుత అవకాశంగా నిలిస్తే, మరికొందరిలో అది ఓ అవాంఛనీయ ఆనారోగ్యకర సమస్యగా మారుతుంది. దాదాపు 50 శాతం జనాభా అంతర్ముఖులుగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. కొందరికి అది వరమయితే, మరికొందరికి శాపంగా మారుతోంది. పరిమిత ఒంటరితనం శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతుంటే, మితిమీరిన ఒంటరితనం ప్రమాదకరంగా మారి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఒంటరితనాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తే అది వ్యక్తి సంపూర్ణ శ్రేయస్సుకు ఉపకరిస్తుంది. ఒంటరితనానికి, ఏకాంతవాసానికి తేడా ఉంది — ఒంటరితనం భావోద్వేగ ప్రతికూల స్థితి అయితే, ఏకాంతం వ్యక్తి కావాలనే ఒంటరిగా ఉండి ఆలోచనల్లో మునిగిపోవడం.
Read Also : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో అదనంగా రూ.లక్ష జమ
ఒంటరితనం రుగ్మతగా మారితే అత్యంత ప్రమాదకరం అవుతుంది. నిశ్శబ్ద రుగ్మతగా సమాజంలో వ్యాపిస్తున్న ఒంటరితనంపై అవగాహన కల్పించడం అవసరం. దీర్ఘకాలం పాటు ఒంటరితనాన్ని అనుభవించిన వారిలో తీవ్రమైన అనారోగ్యాలు, మతిమరుపు, హృదయనాళ సమస్యలు, స్ట్రోక్, నిరాశ, ఆందోళన, మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ఒంటరితనం ఫలితంగా శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ప్రతికూలతలతో పాటు మానవ సంబంధాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అయితే, కొందరికి ఏకాంత వాసం పలు ప్రయోజనాలను కూడా ఇస్తుంది — వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మవిమర్శ, గత లోపాలను సరిదిద్దుకోవడం, భవిష్యత్ ప్రణాళికలు రచించడం, తన బలాలు–బలహీనతలను విశ్లేషించుకోవడం, ఏకాగ్రత పెరగడం, సృజనాత్మక ఆలోచనలు రావడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం వంటి లాభాలు ఉంటాయి.
ఒంటరితనాన్ని ఓడించేందుకు మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండడం, చొరవ తీసుకుని ఇతరులతో మాట్లాడడం, మన అభిరుచులకు తగ్గ వేదికల్లో సమయాన్ని గడపడం, మనసులోని భావాలను పంచుకోవడం వంటి చర్యలు సహాయపడతాయి. ఒంటరితనాన్ని పరిమితం చేస్తూ సమాజంతో దగ్గరవుతూ సంతోషంగా జీవిస్తే, ఎంపిక చేసుకున్న లక్ష్యాలను అధిగమించి చలాకీగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
Read More : Sherry Singh భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్