Bonalu Telangana: షాఢమాసం వచ్చిందంటే చాలు లష్కర్ బోనాల(lashkar bonalu) కోలాహలం మొదలవుతుంది. పోతురాజుల నృత్యాలు, “ జోగినుల పూనకాలు, డప్పుచప్పుళ్లు. తొట్టెల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో లష్కర్ జాతర జన జాతరలా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. లష్కర్ జాతర సమయంలో శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయానికి వచ్చే దారులన్నీ భక్తులతో నిండిపోతాయి. మహంకాళీ మాతాకీ జై! నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది.
ఆషాఢ బోనం (Bonalu)
భోజనం అని అర్ధం బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంలో పాలు, బెల్లం వేసి వండుతారు. కొంతమంది మహిళలు అన్నంలో పసుపు వేసి వండుతారు. ఈ బోనాన్ని మట్టి లేదా ఇత్తడి/రాగి బిందెలకు పసుపు, కుంకుమ, సున్నంతో బొట్లు పెట్టి, వేప రెమ్మలతో అలంకరిస్తారు. దానిపైన ప్రమిదపెట్టి అందులో దీపం కూడా పెడతారు. పాలు, బెల్లం వేసి వండిన బోనంపైన ఒక చిన్న చెంబు పెట్టి అందులో పెరుగు, బెల్లం వేస్తారు. పసుపు అన్నం బోనంకు పైన చెంబులో పచ్చిపులుపు, ఉల్లిపాయలు వేస్తారు. ఇలా తయారు చేసిన బోనాలను మహిళలు తమ తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత బోనాలను(Bonalu Telangana) రాష్ట్ర పండుగగా ప్రకటించి అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
మహిళలు తలంటు పోసుకుని, ముఖానికి పసుపు రాసుకుని, చేతికి నిండుగా గాజులు వేసుకుని, సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకుని ఆనందంగా అమ్మవార్లకు సమర్పించేందుకు డప్పు చప్పుళ్లతో ఇంటి నుంచి బయలుదేరి నృత్యాలు చేసుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. వారి ముందు పోతురాజుల నృత్యంతో వారిని మరింత హుషారెత్తిస్తూ అమ్మ వారి ఆలయానికి చేరుకుంటారు. లష్కర్లో బోనాల జాతర వచ్చిందంటే చాలు వీధులన్నీ ఎంతో కళకళ లాడుతుంటాయి. పల్లెల్లో ఉన్న బంధువులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించేందుకు పట్నానికి చేరుకుని కుటుంబాలతో సహా అమ్మవారి ఆలయానికి వస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారికి ‘సాక’ సమర్పించి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢ సమయంలో మహాకాళీ దేవి తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుందనే పౌరాణిక కథనం. ఈ సమయం దేవతకు బోనాలు సమర్పించడానికి అత్యంత అనుకూలమైన సమయం.
ఆచారం
జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో బోనాల(Bonalu Telangana) జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నగరంలో ఆషాఢంలో మొదటి ఆదివారంనాడు గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో వేడుకలు జరుగుతాయి. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహ మహాకాళీ ఆలయంతో పాటు సికిందరాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని గండి పండుగ మైసమ్మ ఆలయం, మూడవ ఆదివారం చిలకలగూడాలోని పోచమ్మ, కట్టమైసమ్మ ఆలయం, పాత నగరంలోని లాల్ దర్వాజాలోని మాథేశ్వరి ఆలయంలో, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, షాలీబండలోని ముత్యాలమ్మ ఆలయ ఆలయంతో పాటు జంట నగరాల పరిధిలోని అమ్మవారి ఆలయాల్లో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి యేటా లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయాల్లో జరిగే బోనాల వేడుకలకు తరలి వస్తుంటారు. బోనాలను తీసుకువచ్చే మహిళలలో అమ్మవారి ఆత్మ ఉంటుందని నమ్ముతారు. వారు తలపై బోనం ఎత్తుకుని బయలుదేరిన సమయంలో ఆత్మ దూకుడుగా ఉంటుందని, అందువల్ల బోనం ఎత్తుకున్నవారు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆలయానికి వచ్చే వరకు వారి పాదాలపై భక్తులు నీళ్లు పోస్తుంటారు.
తొట్టెలు(Thottela)
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తాము ఆలయానికి చేరుకున్నట్లు అమ్మవారికి వెదురుబద్దెలతో తయారు చేసి, దానికి రంగు రంగుల కాగితాలను అతికించి అందంగా తయారు చేసి అమ్మ వారికి తొట్టెలను సమర్పిస్తారు. తొట్టెలను ఇంటి నుంచి ఆలయానికి తీసుకు వచ్చే సమయంలో డప్పు చప్పుళ్లతో బయలుదేరి నృత్యాలతో ఆడుతూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.
పోతురాజు (Pothuraju)
బోనాల(Bonalu Telangana) జాతరంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోతురాజులే. పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవతకు సోదరుడిగా పేర్కొంటారు. ఊరేగింపులో అతని పాత్ర చాలా బలంగా ఉంటుంది. పోతురాజు ఎర్రటి ధోతీ, కాళ్లకు గజ్జెల గంటలు ధరించి, శరీరంపై పసుపు పూసుకుని నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. కళ్లకు నల్లని కాటుక ధరిస్తాడు. ఊరేగింపులో డప్పు చప్పుళ్లుకు అనుగుణంగా నృత్యం చేస్తూ భక్తులను ఉత్సా హపరుస్తుంటాడు. పోతురాజు ఫలహారం బండ్ల ముందు, ఊరేగింపు ముందు ఉండి నృత్యం చేస్తుంటాడు. ఉత్సవాలను ప్రారంభించేవాడిగా గుర్తింపు పొందిన పోతురాజు చేతిలో కొరడా. పట్టుకుని ఉంటాడు.
ఘటం ఎదుర్కోలు ప్రారంభం
ఈ యేడాది జూన్ 29వ తేదీ ఆదివారంనాడు. ఘటోత్సవం (ఎదుర్కోలు)తో జాతర ప్రారంభం అయింది. వెదురు బద్దెలతో తయారు చేసిన ఘటానికి రంగురంగుల కాగితాలు అతికించి అమ్మవారి (మాతృదేవత రూపంలో) ఘటాన్ని తయారు చేస్తారు. సాంప్రదాయ ధోతీ ధరించి ఒంటి నిండా పసుపు పూసుకున్న పూజారి తలపై ఘటాన్ని మోస్తాడు. అమ్మవారి దర్శనానికి రాలేనివాళ్ల కోసం ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో ఘటాన్ని ఊరేగింపుగా తీసికెళ్తారు. భక్తులు అక్కడే ఘటానికి పూజలు నిర్వహించుకుని అమ్మవారికి మొక్కుకుంటారు. 29న అమ్మ వారి ఘటం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి కర్బలా మైదానంలోని అమ్మ వారి ఆలయం దగ్గర ఘటం అలంకరణ పూర్తి చేసుకొని రాత్రి 10 గంటలకు దేవాలయానికి చేరుకున్నది. జూన్ 30వ తేదీన హిమాంభావి, డొక్కలమ్మ దేవాలయం, ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుకుంది. జులై 1వ తేదీన ఉదయం 10 గంటలకు కళాసీగూడా ఏరియాకు బయలుదేరి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకున్నది. జులై 2న నల్లగుట్ట ఏరియాకు ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకున్నది. జులై 3న పాన్ బజార్ ఏరియాకు ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంది. జులై 4న ఓల్డ్ బోయిగూడా ఏరియాకు ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయల దేరి రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకున్నది. జులై 5న ఉదయం 10 గంటలకు ఆలయం నుంచి రంగ్రేజీ బజార్ ఏరియాకు బయలుదేరి రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంది. జులై 6న ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి చిలకలగూడా ప్రాంతానికి చేరుకుని రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది. జులై 7న ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి ఉప్పర్ బస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది. 8న ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి కుమ్మరిగూడా ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది. 9న ఉదయం 10 గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి రెజిమెంటల్ బజార్ ఏరియాకు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది. 10న ఘటం ఏ వీధిలోకి వెళ్లదు. దేవాలయంలోనే ఉంటుంది. 11న ఉదయం 10 గంటలకు బయలుదేరి బోయిగూడాకు చేరుకుంటుంది. 12వ తేదీ రాత్రి 7 గంటలకు తిరిగి దేవాలయానికి చేరుకుంటుంది.
13నబోనాలు (13 Bonalu)
సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం 13న బోనాలు అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పాటు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సారెను సమర్పిస్తారు. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్, సికిందరాబాద్, తెలంగాణా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.
సాధారణంగా జులై లేదా ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం 4 గంటలకు వేద మంత్రోచ్చారణలతో ఆలయ ద్వారాన్ని తెరచి ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి సాక,
బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు దర్శనం చేసుకుంటారు. రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 2 గంటలకు వరకు ఆలయం చుట్టూ ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. పోతురాజులు ఆలయం బయట, లోపల విన్యాసాలు చేస్తారు.
14న రంగం (భవిష్యవాణి)
బోనాల(Bonalu Telangana) కార్యక్రమం పూర్తయిన తరువాత సోమవారం ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వరకు జలకుండ, పచ్చికుండ, గుమ్మడి కాయలను వివిధ ప్రాంతాలలోని ఇళ్ల నుంచి బాజా భజంత్రీలతో తీసుకొని వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి రతి బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయాన్ని శుభ్రపరుస్తారు. ఉదయం గం.8.30 ని||ల నుంచి 9 గంటల వరకు రంగం(భవిష్యవాణి) అమ్మవారి ఆలయానికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తుంది. రంగం కార్యక్రమం అనంతరం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు సొరకాయ, గుమ్మడికాయ బలితీయడం, గావు పట్టడం, పోతురాజుల విన్యాసాలు, ఘటం సాగనంపు.. వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి చిత్రపటాన్ని ఏనుగుపై ప్రత్యేక అలంకరణ చేసి బ్యాండు, బాజా వాయిద్యాలతో పెద్ద సంఖ్యలో భక్తులు, స్వచ్ఛంద సంస్థలతో, పుర ప్రముఖులతో ఆలయం చుట్టూ అంబారీపై ప్రదక్షిణ చేసి పురవీధుల గుండా మెట్టుగూడా ప్రాంతానికి ఘటం, పోతురాజులతో అంబారీ ఊరేగింపు సాగుతుంది. అనంతరం ఉదయం 11.30 ని॥ల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం: సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఫలహార బండ్లు ఊరేగింపు సాగుతుంది. రాత్రి 12 గంటలకు మంత్ర పుష్పం, మహా హారతితో అమ్మవారికి నివేదన చేస్తారు. అనంతరం ఆలయాన్ని మూసి వేస్తారు.
శ్రీ ఉజ్జయినీ మహాకాళీ (ujjaini mahankali)
సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి బోనాల జాతరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టి పనులు వేగంగా చేస్తున్నారు. ఆషాఢ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవాలయానికి మహామండపం, ఆప్గ్రేట్, ప్రహరీగోడలు, సాలహారము, శ్రీ వీరభద్ర సహిత మహా కాళేశ్వర, శ్రీమాతంగేశ్వరి, శ్రీ దండు మారెమ్మ, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయాలకు పూర్తి పంచ రంగులు వేయిస్తున్నారు. జంట నగరాలలో ఇప్పటికే జాతరకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు ఏర్పాటు చేసారు. ఆలయ చరిత్ర, జాతర విశేషాలతో ప్రత్యేక బుక్లెట్ తయారీ చేస్తున్నారు. అమ్మవారి ఆలయంలో మంగళ, శుక్ర ఆదివారాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.
దీంతోపాటు పౌర్ణమినాడు ఆలయంలో హోమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
కోల్ కత్తా డెకరేషన్
శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మ వారి ఆలయంలో ఆషాఢ బోనాల జాతరొచ్చిందంటే చాలు అమ్మ వారి ఆలయం మరింత శోభాయమానంగా తయారవుతుంది. కలకత్తా డెకరేషన్తో కలకత్తా మాదిరిగా పందిళ్లతో కూడిన 6 క్యూ లైన్లు, దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన అలంకరణ, వాటర్ ఫ్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో భక్తులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఆషాఢ బోనాల(Bonalu Telangana) జాతరకు అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు వివిధ స్వచ్చంద సంస్థలు ఏన్నో యేళ్లుగా సేవలందిస్తున్నాయి. క్యూ లైన్లలో తాగు నీటిని పంపిణీ చేయడం, అమ్మ వారిని వీలయినంత త్వరగా దర్శించుకునేందుకు వీలుగా వీరు సేవలు అందిస్తుంటారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తుంటారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహంకాళీ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తుంటారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను తరలించేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అగ్నిమాపక శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు అగ్ని మాపక శకటాలను ఆలయ ప్రాంగణానికి సమీపంలో అందుబాటులో ఉంచుతున్నారు.(Bonalu Telangana)
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ నిరంతరాయంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుతో పాటు ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐఅండ్పీఆర్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించనున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఆట పాటలు నిర్వహించనున్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలోని భక్తులకు తాగునీరు అందించడం, క్యూ లైన్ల నిర్వహణలో సేవలందించనున్నారు. ఎన్సీసీ రెండు రోజుల పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించనున్నారు.
దక్కన్ మానవ సేవా సమితి, నల్లగుట్ట అభివృద్ధి సంఘం, మున్నూరు కాపు సంఘం, ఆర్య వైశ్య సేవా సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సేవలందించనున్నారు.
జాతర సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయానికి వచ్చే అన్ని క్యూ లైన్లు, ఇతరత్రా మార్గాల్లో సీసీ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి మహకాళీ పోలీసు స్టేషన్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ చరిత్ర (Temple history)
రాజుల కాలంలో రాజులు, రాణులు వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రావాలంటే పల్లకిని ఉపయోగించేవారు. ఆ పల్లకిని బోయీలు మోసేవారు. యుద్ధాలు జరిగిన సమయంలోనూ గాయపడిన వారిని చికిత్స కోసం తరలించడంలోనూ వీరి పాత్ర కీలకంగా ఉండేది. అలాగే బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో సికిందరాబాద్ మిలటరీ బెటాలియన్ లో ఒక బోయీగా పని చేసాడు సురిటి అప్పయ్య. ఆయన కృషితోనే సికిందరాబాద్లో శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగింది. 1813వ సంవత్సరంలో హైదరాబాద్, సికిందరాబాద్లో ప్లేగు మహమ్మారి విజృంభించి వేలాది మంది జనం మృత్యువాత పడ్డారు. ఈ సమయంలో సురిటి అప్పయ్య బెటాలియన్ పాటు మధ్య భారత్లోని ఉజ్జయినీకి బదిలీపై వెళ్లాడు అప్పయ్య. అక్కడ ఉన్న మహంకాళీ ఆలయానికి వెళ్లి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా ప్రజలందరి కోసం “తల్లీ! ఈ విపత్కర పరిస్థితుల నుంచి సకల మానవాళిని కాపాడాలనీ, అది జరిగితే సికిందరాబాద్లో శ్రీ ఉజ్జయినీ మహకాళీ అమ్మ వారి విగ్రహం పెడతానని, అమ్మవారికి గుడి కడతానంటూ మొక్కుకున్నాడు. కొద్ది కాలానికి వ్యాధి తగ్గుముఖం పట్టడం, సురిటి అప్పయ్య సికిందరాబాద్కు బదిలీ అయిరావడం జరిగింది. అమ్మవారికి తాను మొక్కిన మొక్కును గుర్తు పెట్టుకున్న అప్పయ్య తన సహచరుల సహాయం తీసుకుని కర్రతో చేసిన ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి విగ్రహాన్ని అప్పటి లష్కర్లోని ఒక ఖాళీ ప్రదేశంలో (1815 జులై నెలలో) ప్రతిష్టించి చిన్న గుడి కట్టించాడు.
నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న పాత బావిని బాగు చేస్తున్న సమయంలో మాణిక్యాలమ్మ విగ్రహం దొరికింది. ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా గుడిలోనే ప్రతిష్టించాడని కథనం. తదనంతర కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య(1900), ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య (1914), అతని వారసుడు కిష్టయ్యలు వరుసగా శ్రీ ఉజ్జయినీ మహాకాళీ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసారు. ఆ తరువాత సమయంలో పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి దేవాదాయ శాఖకు ఈ ఆలయాన్ని (1947)లో అప్పగించారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్భంగా దేశ, విదేశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.
ఆలయ ఈ.ఓ. గుత్తా మనోహర్ రెడ్డి
ఆషాఢ బోనాల(Bonalu Telangana) సందర్భంగా సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈ.ఓ. గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేసారు. ప్రతి యేటా అమ్మ వారి ఆషాఢ బోనాల జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటారని ఆయన తెలియజేసారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ ప్రాంగణంలో గద్దె ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అమ్మ వారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తామని ఈ.ఓ. తెలియ జేసారు.
అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతరత్రా వీవీఐపీల రాక సందర్భంగా పటిష్టమైన జాగ్రత్తలు చేపట్టనున్నామని ఆయన తెలియజేసారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తున్నామని ఈ.ఓ. తెలియజేసారు.
Read hindi News: hindi.vaartha.com
Read Also : Lord jagannath: పురుషోత్తమ ధామం….పూరీ జగన్నాధం