విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు. రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను నేర్పించనున్నారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) స్కిల్స్ ను పెంపొందించడం ఈ ల్యాబ్య్ ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ లో డీఐవై కిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT), 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, కోడింగ్ స్కిల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అకాడెమీ, ఇండస్ట్రీ నుంచి నిపుణులతో మెంటార్ షిప్ ప్రోగ్రాం, సృజనాత్మకతలో సవాళ్లు, పోటీతత్వం.. తదితర అన్ని విభాగాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. భారత్ స్టార్టప్ సిస్టమ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చిన్నవయసునుంచే విద్యార్థుల్లో స్టార్ట్ అప్ వ్యవస్థలపై అవగాహన కల్పించడం. పాఠశాల నుంచే విద్యార్థులకు టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.