News Telugu: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందే తమ ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ను విడిచిపెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహాన్ని ఇటీవల స్పష్టంగా వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగా, ఇది ఒక కఠినమైన కానీ తప్పనిసరి నిర్ణయం.
సిరాజ్‌పై దీర్ఘ చర్చలు
మో బోబాట్ (Mo Bobat) మాట్లాడుతూ, “సిరాజ్ విషయంలో మేం చాలా కాలం చర్చించాం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే రాణిస్తున్న భారత బౌలర్‌ను వదిలేయడం అంత సులభం కాదు. అతడిని రిటైన్ చేసుకోవాలా? వదిలేయాలా? లేక రైట్ టు మ్యాచ్ కార్డు వాడాలా? అన్న ప్రతి అవకాశం గురించి మేం లోతుగా ఆలోచించాం. చివరకు ఇది జట్టు భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం” అని తెలిపారు.
భువనేశ్వర్‌ను దక్కించుకోవాలన్న వ్యూహం
ఆర్సీబీ ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తెచ్చుకోవడమే అని బోబాట్ స్పష్టం చేశారు. “ఇన్నింగ్స్ ప్రారంభంలో, మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో అదుపు చేయగల బౌలర్ కోసం మేం వెతికాం. భువీ ఆ విషయంలో అద్భుతమైన ఆప్షన్. సిరాజ్‌ను కీప్ చేసుంటే, వేలంలో భువీని తీసుకోవడం అసాధ్యం అయ్యేది. అందుకే వ్యూహాత్మకంగా సిరాజ్‌ను వదిలేయాల్సి వచ్చింది” అని ఆయన వివరించారు.
ఆర్సీబీకి ఫలించిన సాహసోపేత నిర్ణయం
ఈ నిర్ణయం ఆర్సీబీకి విజయాన్ని తెచ్చింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి, ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల భువనేశ్వర్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని మేము బలంగా అనుకున్నాం. ఒకవేళ సిరాజ్‌ను అట్టిపెట్టుకుని ఉంటే, వేలంలో భువీని కొనడం కష్టమయ్యేది.
భువనేశ్వర్, హేజిల్‌వుడ్ రాణింపు
వేలంలో రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఆయన ఈ సీజన్‌లో 17 వికెట్లు తీసి జట్టుకు మేలుచేశారు. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ 22 వికెట్లు తీసి టోర్నీలో టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి ప్రదర్శనతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలపడింది.
గుజరాత్ తరఫున సిరాజ్ ప్రదర్శన
మహ్మద్ సిరాజ్ ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ 15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. గతంలో ఆర్సీబీ తరఫున 87 మ్యాచ్‌ల్లో 83 వికెట్లు తీసిన సిరాజ్, ఈ సీజన్‌లో కూడా తన స్థాయిని కొనసాగించినప్పటికీ, ఆర్సీబీ వ్యూహాత్మకంగా భువీని ఎంచుకోవడం వారికి మొదటి ట్రోఫీని తెచ్చిపెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: