రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ విజయం అభిమానులకు గర్వకారణం అయినా, అదే వేడుక ప్రాణాంతక ఘటనకు దారితీయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల హృదయాలను కలచివేసిన ఈ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు, బీసీసీఐ అధికారులు స్పందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతటి కీలమో స్పష్టంగా తెలియజేశారు.

జనసందోహం.. అప్రమత్తతలో లోపం
ఆర్సీబీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీగా అభిమానులు గుమిగూడారు. తొలుత విధాన్ సౌధ నుంచి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ, జనసందోహం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ, వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది.
బీసీసీఐ స్పందన: కఠిన మార్గదర్శకాలకు శంకుస్థాపన
ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పందిస్తూ, ఇది కళ్లు తెరిపించే సంఘటన అని, క్రికెట్ బోర్డు కేవలం ప్రేక్షకపాత్ర వహించదని స్పష్టం చేశారు. నిర్వాహకులు మరింత మెరుగ్గా ప్రణాళిక వేసి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆర్‌సీబీకి సంబంధించిన ప్రైవేటు వ్యవహారం.
ఈ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు తాము బాధ్యత తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాల విషయంలో పునరాలోచిస్తామన్నారు. నిర్వాహకులు, స్థానిక అధికారులు, పోలీసుల మధ్య మెరుగైన సమన్వయం, పటిష్టమైన జన నియంత్రణ చర్యలు అవసరమని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు.
బెంగళూరు దుర్ఘటన క్రీడా కార్యక్రమాల భద్రతపై విస్తృత చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ నేపథ్యంలో సరైన ప్రణాళిక, నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన స్పష్టం చేసింది. బెంగళూరు విషాదం పునరావృతం కాకుండా నిరోధించడానికి, బీసీసీఐ క్రీడా సంబంధిత బహిరంగ వేడుకల కోసం కఠినమైన మార్గదర్శకాలు, మరింత పటిష్టమైన భద్రతా ప్రమాణాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Read also: KSCA: ఆర్సీబీ ఘటనలో కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా