బెంగళూరులో (Bangalore) జూన్ 4న చోటుచేసుకున్న ఆర్సీబీ (RCB) విజయోత్సవాల సందర్భంగా జరిగిన తీవ్ర తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి టైటిల్ సాధించిన నేపథ్యంలో, మైదానంలో అభిమానులతో కలిసి జరుపుకోవడానికి ఏర్పాటు చేసిన ఉత్సవం ప్రమాదంలోకి దారి తీసింది. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 56 మంది గాయపడ్డారు. ఇది కేవలం అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కాదు, ఇది కచ్చితంగా నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, ప్రణాళికలో లోపం వల్ల జరిగిన సంఘటనగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎమోషన్‌ను వాడుకున్న రాజకీయ నేతలు?
ఆర్సీబీ అభిమానుల ఆనందాన్ని ఉపయోగించుకుని రాజకీయ నేతలు తమ పేరు ప్రచారం చేసుకోవాలనే ధోరణితో ఈ వేడుకలను నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భయంకరమైన విషాదం నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , డీకే శివకుమార్ సహా కెఎస్సిఎ అధికారులపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజల్లో ఉన్న ఎమోషన్‌ను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు విధాన సౌధ ముందు RCB ఆటగాళ్లను సత్కరించడం, చిన్నస్వామి స్టేడియంలో వారి విజయాన్ని జరుపుకోవాలనే తొందరపాటు నిర్ణయం, సరైన భద్రతను నిర్లక్ష్యం చేయడం వలన సుమారు 11 మంది మరణించారు.
భారత శిక్షాస్మృతి సెక్షన్ 106 కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్
స్నేహమయి కృష్ణ తన ఫిర్యాదులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 106 కింద కేసు నమోదు చేయాలని కోరారు. తొక్కిసలాట విషాదం నేపథ్యంలో న్యాయవాది నటరాజ శర్మ కూడా ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విధానసౌధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు.
ఈ కేసుకు సంబంధించి బెంగళూరులో హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర ఒక ప్రకటన చేస్తూ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ ఘటనలో 56 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 46 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 10 మందికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
DK Shivakumar: బెంగళూరు ఘటనపై కన్నీరు పెట్టుకున్న డీకే శివకుమార్