కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్ దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన ఒక్క అధికారి కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. టోర్నీ ఆతిథ్య దేశం అయినప్పటికీ, కనీసం ట్రోఫీ అందించే వేళా పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధుల గైర్హాజరీపై ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు.తాజాగా, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “మనం ఈ టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నాం, కదా? అయినా, పీసీబీ నుంచి ఒక్కరు కూడా బహుమతి ప్రదానోత్సవంలో కనిపించకపోవడం విచిత్రమే అక్రమ్ మాట్లాడుతూ, “నాకు తెలిసినంత వరకు పీసీబీ చైర్మన్ ఆరోగ్య సమస్యలతో ఉండటంతో, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్, పీసీబీ ఇంటర్నేషనల్ వ్యవహారాల డైరెక్టర్ ఉస్మాన్ వహ్లా దుబాయ్‌కి వచ్చారు.
కానీ వారిలో ఒక్కరు కూడా బహుమతుల ప్రదానోత్సవం వద్ద కనిపించలేదు. వారిని వేదికపైకి ఆహ్వానించలేదా? లేక వారే వెళ్లలేదా ఆ విషయం నాకు తెలియదు.”కానీ నాతో పాటు చూసిన ప్రతి ఒక్కరికీ ఇది అసహనంగా అనిపించింది. కనీసం పీసీబీ నుంచి ఒక్కరు వేదికపై ఉంటే గౌరవంగా ఉండేది. ట్రోఫీ బహూకరించారా లేదా మెడల్స్ అందించారా అనేది ముఖ్యంకాదు, కానీ ప్రతినిధిగా అక్కడ ఒకరు అయినా ఉండాల్సింది,” అని వసీం అక్రమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వివాదం ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పీసీబీ వ్యవహారశైలిపై అభిమానులు, విశ్లేషకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ క్రికెట్ పరువు దెబ్బతిన్నదని పలువురు మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.