భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం పలు విభేదాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మరియు సీనియర్ ఆటగాళ్ల మధ్య జట్టు కల్చర్, పనితీరు పద్ధతులపై స్పష్టమైన విభేదాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష చేపట్టగా, ఈ విభేదాలు మరింత వెలుగులోకి వచ్చాయి.గంభీర్ జట్టులో క్రమశిక్షణ, ప్రాక్టీస్ సమయాలు, హోటల్ ఎంపికల్లో కఠినంగా వ్యవహరిస్తుండగా, కొంతమంది స్టార్ ఆటగాళ్లు ప్రత్యేక డిమాండ్లతో ముందుకు వచ్చారు. ఇది గంభీర్‌కు నచ్చక, ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరోవైపు, సీనియర్ ఆటగాళ్లు గంభీర్ కమ్యూనికేషన్ పద్ధతిపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ధోరణి ఆస్ట్రేలియన్ కోచ్ గ్రేగ్ ఛాపెల్‌ను గుర్తుచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో గ్రేగ్ ఛాపెల్ తీసుకున్న కఠిన నిర్ణయాలు జట్టులో భిన్నాభిప్రాయాలకు దారితీశాయి.ఇంతకుముందు రవిశాస్త్రి మాదిరిగా మీడియాతో మైత్రీగా ఉండటం లేదా రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్స్టెన్‌లా కూల్‌గా వ్యవహరించడం జట్టుకు మంచిదని మాజీ సెలెక్టర్లు అభిప్రాయపడ్డారు. అయితే, గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, ఆటగాళ్లతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.ఈ వివాదంలో మరో ముఖ్య అంశం గంభీర్ వ్యక్తిగత సహాయకుడి వ్యవహారం.
ఆస్ట్రేలియా పర్యటనలో అతను జట్టును ప్రతి అడుగునా అనుసరించాడని సమాచారం.సెలెక్టర్ల కోసం కేటాయించిన కారులో అతను ఎలా ప్రయాణించాడు? బీసీసీఐ హాస్పిటాలిటీ బాక్స్‌లో అతనికి ఎలా స్థానం దక్కింది? అని బీసీసీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో అతను ఎలా బ్రేక్‌ఫాస్ట్ చేశాడు? అనే అంశాలు మరింత వివాదాస్పదంగా మారాయి.ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జట్టులో వాతావరణం అసహజంగా మారిపోయింది. కోచ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు తమ అభిప్రాయభేదాలను పరిష్కరించుకుని జట్టు సమగ్రతను కాపాడుకోవాలి. లేకపోతే, ఈ అంతర్గత సమస్యలు జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.