సమ్మర్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా మనం రోజూ ఉపయోగించే మొబైల్ ఫోన్లు వేడెక్కే సమస్యకు గురవుతుంటాయి. నేరుగా సూర్యకాంతి ఫోన్పై పడితే, పరికరం వేడిని మరింతగా శోషించడంతో వేడెక్కడం వేగవంతమవుతుంది. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపించడంతో పాటు, హార్డ్‌వేర్ డ్యామేజ్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
ఫోన్ వాడకాన్ని తగ్గించాలి
వేసవిలో ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, హీటింగ్ యాప్స్ వంటి వాటిని ఎక్కువసేపు వాడకపోవడం మంచిది. ఫోన్ వేడిగా అనిపిస్తే, కొన్ని క్షణాలపాటు స్విచ్ ఆఫ్ చేసి కూల్ అయ్యేలా చూడాలి. ఫోన్‌ని ఛార్జింగ్ చేస్తూ ఉపయోగించడం, అధిక బ్రైట్‌నెస్‌తో వాడటం వంటి అలవాట్లు వేడెక్కింపునకు దారితీస్తాయి. ఇవి తప్పించుకుంటే ఫోన్ జీవితకాలం పెరుగుతుంది.

వేడెక్కిన ఫోన్‌ను ఫ్రీజ్ చేయకండి!
చాలామంది ఫోన్ వేడెక్కినప్పుడు వెంటనే ఫ్రీజర్లో పెట్టడం ద్వారా చల్లబరిచే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. ఈ విధంగా ఉంచితే మినీ షార్ట్ సర్క్యూట్, డిస్‌ప్లే డ్యామేజ్, లేదా ఫోన్ పూర్తిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు రావచ్చు. సాధ్యమైనంత వరకు ఫోన్‌కి సహజంగా తేమ లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే ఉత్తమం.
కారులో వదిలేయకండి
అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే కారులో ఫోన్‌ను వదిలివేయడం కూడా చాలా ప్రమాదకరం. మూసివేసిన కారు లోపల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుందని, అలాంటి వాతావరణంలో ఫోన్ ఉంచితే బ్యాటరీ పేలే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఫోన్‌కి రక్షణగా ఉండేందుకు సంచుల్లో, నీడలో ఉంచడం అలవాటు చేసుకోవాలి.