హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చారిత్రాత్మక ఒప్పందం చేసుకోనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజస్థాన్ లో ఎంఓయు జరగనుంది.

1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం
ఈ భాగస్వామ్యంతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ఒప్పందం కుదురనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సింగరేణి ఆర్థిక పరిపుష్టికి విస్తృత అవకాశాలు లభించనున్నాయి. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో, సింగరేణి జాతీయ స్థాయి కంపెనీగా గుర్తింపు పొందింది. మొత్తం పెట్టుబడిలో 74 శాతం సింగరేణి, 26 శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ (RVPNL) వాటాగా ఉండనుంది. తెలంగాణ ప్రభుత్వం, రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు
ఇకపోతే..తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సింగరేణి సంస్థ గత కొన్నేళ్లుగా తన కార్యకలాపాలను విస్తరిస్తూ, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, విద్యుత్ ఉత్పత్తిలో కూడా తన ప్రభావాన్ని చూపేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్ శాఖలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటూ పరిమితులను దాటే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.ఈ ఒప్పందం ద్వారా సింగరేణి విద్యుత్ ఉత్పత్తి రంగంలో తన ప్రభావాన్ని మరింత పెంచనుంది.