ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం మిషన్, విజన్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తిగా పక్కన పెట్టడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

కేంద్రం పై ఆధారపడింది
రైతులకు, విద్యార్థులకు, మహిళలకు తగిన విధంగా నిధులు కేటాయించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించకుండా, కేంద్రంపై ఆధారపడేలా చేయడం అన్యాయమని విమర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి సరిపడా నిధులు లేకపోవడం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలకూ కోత విధించడం విద్యా రంగానికి నష్టమని పేర్కొన్నారు. అలాగే, ‘దీపం-2’ పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం ఏంటి..?
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి నిధులు కేటాయించకపోవడం, మహిళా ఆర్థిక సాధికారత కోసం ‘మహాశక్తి’ పథకాన్ని పూర్తిగా విస్మరించడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ కాలెండర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా, 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. అంతేగాక, రాజధాని అమరావతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అప్పులతోనే నిర్మించాలని భావించడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అసమతుల్యతలు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేయగలవని ఆమె హెచ్చరించారు.