వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా అత్యంత వేగంగా సమాచారాన్ని విశ్వవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడంలో సోషల్ మీడియాకు(social media) మించింది ప్రస్తుతం మరొకటి లేదు. సోషల్ మీడియాపై సరైన ఆంక్షలు, నిబంధనలు లేకపోవడంతో ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ఉన్న పరిమితులు సోషల్ మీడియాలో లేకుండా పోయాయి.
యూట్యూబ్, వైబ్ సైట్ల నిర్వహణకు అర్హత అంటూ ఏదీలేదు. ఎవరైనా ప్రారంభించుకోవచ్చు. వారికి విషయ పరిజ్ఞానం ఉందా, విద్యా అర్హతలు ఏమిటి, సమాజ శ్రేయస్సు కోరి ఈ వేదికను ఎంచుకున్నాడా, వర్గ, మత విద్వేషాలను రెచ్చగొట్టే
అవకాశం ఉందా అన్న ఏ అంశానికి కూడా సమాధానం లభించదు. సోషల్ మీడియాలో(social media) వచ్చే అంశాలకు ఎటువంటి సెన్సార్ ఉండదు. ఒకవేళ వివాదాస్పద అంశాన్ని పోస్ట్ చేస్తే దానిపై ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఉండటం లేదు. ఒకవేళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే సదరు అంశాన్ని తొలగించడానికి 72 గంటల కనీసం సమయం ఉంటుందని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఇన్ఫ్రాగ్రాం, ఫేస్బుక్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది ఎక్కువ సమయం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ముందుగా ఇలాంటి అంశం సోషల్ మీడియాలో వచ్చిందని తెలియడంలోనే తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇటీవల ఫేస్బుక్లో నేరగాళ్లు నకిలీ అకౌంట్లతో వేరొకరి ఖాతాలను తెరుస్తున్నారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు ఐపిఎస్, ఐఎఎస్
అధికారులు పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్లతో ఫేస్బుక్ (facebook)ఫ్రెండ్స్కు పోస్టింగ్లు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. నిజంగానే సదరు అధికారి డబ్బులు అడుగుతున్నారని భావించిన కొందరు నేరగాళ్ల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. సదరు అధికారికి ఈ విషయం తెలిసే సరికి ఆలస్యం అవుతోంది. ఆ నకిలీ అకౌంట్ తొలగించడానికి 72 గంటల పైగా పట్టడంతో మరికొందరిని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశం కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో నేరగాళ్లు ఏ ప్రాంతానికి చెందిన వారో కూడా అర్థం కావడం లేదు.
వాట్సప్ లో(whatsapp) ఒక మహిళ డిపిగా పెట్టుకున్న ఫోటోను నేరగాళ్లు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్లోలో పెట్టారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అన్ని సోషల్ మీడియా సంస్థలు మధ్యవర్తి వ్యవస్థలను ఏర్పాటుచేసుకుని యూజర్కు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఆయా సంస్థలకు లక్షల్లో ఫిర్యాదులు వస్తున్నా కేవలం అందులో నాలుగైదు శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జిఎసి)ని నియమించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలులోకి తీసుకురాలేకపోయింది. అభ్యంతకర పోస్టులు పెట్టిన తరువాత మాత్రమే గుర్తించే అవకాశం ఉండటం వల్ల సోషల్ మీడియా వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. పోస్టింగ్కు ముందే ఆయా సబ్జెక్ట్లను పరిశీలించే అవకాశం లేకపోవడం వల్ల సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే జిఎసిలో వ్యక్తిగత భద్రత, వ్యక్తిగతమైన సమాచారం వంటి వివరాల పోస్టింగ్లు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్, చిన్నారులకు నష్టం కలిగే అంశాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, ప్రజలకు, సమాజానికి నష్టం, ప్రజాజీవనానికి భంగం కలిగే అంశాలు, నేరపూరితమైన పోస్టింగ్లు, నేరాలను ప్రేరేపించే అంశాల అప్లోడింగ్, దొంగతనాలు ఎలా చేయాలి, ఆత్మహత్యలు ఏ విధంగా చేసుకోవాలి, హత్యను సాక్ష్యాలు లేకుండా ఎలా చేయాలి అన్న విషయాలపై చేసే పోస్ట్లు, మతాలను, కించపరిచేలా చేసేటటువంటి ఇతర అంశాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని ప్రకటించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా, దేశభద్రతను దెబ్బతీసే విధంగా ఉండే పోస్టులపై కూడా జిఎసీలో ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే కమిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. జిఎసీ ఏర్పడి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే చాలా వరకు ఇలాంటి అభ్యంతకర అంశాలకు చెక్ పెట్టే అవకాశం వస్తుంది.
అదేవిధంగా ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి పోస్టింగ్లు చేసే వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా వెబ్సైట్లు, ఓటీటీలు, ఇతర డిజిటల్ వేదికలు మధ్యవర్తిత్వ అప్పిలేట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రజలు తమ అభ్యంతరాలను ఫిర్యాదులను ఆయా సంస్థల మధ్యవర్తిత్వ అప్పిలేట్లకు లిఖితపూర్వకంగా, ఈ మెయిల్ రూపంలో అందించే అవకాశం ఉంది.
నెలరోజుల్లోగా ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి ఫిర్యాదికి సమాచారం ఇవ్వడం, ఫిర్యాదులో వాస్తవం ఉంటే ఆయా కంటెంట్ను వెంటనే తొలగించే అవకాశం ఉంటుంది. అయితే లక్షల్లో పేరుకుపోతున్న ఫిర్యాదుల పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంటోంది. అదేవిధంగా ఉద్దేశ్యపూర్వకంగా అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకునే విధంగా చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం ఉంది. అభ్యంతరకర పోస్టింగ్లు చేస్తే ఎంత నేరమో వచ్చిన పోస్టింగ్ను పరిశీలించకుండా ఇతర గ్రూపులకు పోస్టింగ్ చేయడం కూడా అంతే నేరమన్న విషయాన్ని సోషల్ మీడియా వినియోగదారులు గ్రహించాలి.
Read Also: Digital transactions: డిజిటల్ లావాదేవీలు మరింత పెరగాలి