విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పెనుభూతంగా మారింది. ఎందరో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ర్యాగింగ్కు భయపడి వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ర్యాగింగు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు ఉన్నా, పోలీసుల నిఘా కొనసాగినా పూర్తి స్థాయిలో దీనిని అణచివేసే పరిస్థితులు కనిపించడం లేదు.
సీనియర్లు చేసే తమాషా పరిచయాలు కాస్త దారుణంగా మారి విద్యార్థుల జీవితాలు బలైపోయిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. అందుకే దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ర్యాగింగ్ చేస్తే జైలు (jail) శిక్షలు తప్పవని, చదువుకు స్వస్తి పలకాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీనియర్స్ స్టూడెంట్లే కాదు కాలేజ్ యాజమాన్యాలను సైతం చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్షలు పడేలా చేశారు. ఇటీవల వరంగల్లో మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ శ్రుతిమించడంతో పిజి విద్యార్థిని మృతి చెందడం, కొందరు విద్యార్థులపై (students) కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. గుంటూరులోని మెడికల్ కళాశాలలో కూడా ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిని పూర్తిగా అరికట్టాలన్న లక్ష్యంతో కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు.
ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ర్యాగింగ్ బెడద మాత్రం తప్పడం లేదు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత పెరిగిపోవడంతో కొత్త విధానంలో ర్యాగింగ్ కొనసాగుతోంది. ఈసారి సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మళ్లీ పంజా విసిరింది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ విద్యార్థులను వేధించేందుకు సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా ఇకపై ర్యాగింగ్ గానే పరిగణించనున్నట్టు స్పష్టం చేసింది.
యాంటీ ర్యాగింగ్ నిబంధనలు
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సీనియర్లు ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా జూనియర్లను మానసికంగా వేధిస్తున్నారని ప్రతీ ఏటా తమకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా యని యూజీసీ తన తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. ఇలాంటి చర్యలు కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయి. వీటిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. క్యాంపస్లలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. యాంటీ ర్యాగింగ్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యే విద్యాసంస్థలకు గ్రాంట్లను నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తప్పవని యూజీసీ హెచ్చరించింది.
సీనియర్ల సూచనలు పాటించని జూనియర్లను సామాజికంగా బహిష్కరిస్తామని బెదిరించడం, ఎక్కువ గంటలు మేల్కొని ఉండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటివి కూడా తీవ్రమైన ర్యాగింగ్ చర్యలేనని పేర్కొంది. ఇలాంటి పనులు విద్యార్థులలో తీవ్రమైన శారీరక, మానసిక క్షోభకు కారణమవుతాయని, ఇవి యాంటీర్యాగింగ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని యూజీసీ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ప్రధానంగా ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో సోషల్ మీడియా ద్వారా ర్యాగింగ్ను కొనసాగిస్తున్నారు.
ప్రధానంగా వృత్తి విద్య కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు అనధికార వాట్సప్ గ్రూప్లను ఏర్పాటుచేసి అందులో కొందరు జూనియర్లను చేర్చి వారిపై అసభ్య పదజాలంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ మెసేజ్లను బయటకు చెబితే కళాశాలలోకి రాకుండా చేస్తామని, దాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. దీనితో జూనియర్లు ఇబ్బందులకు గురౌతున్నారు. సెల్ఫోన్లో వాట్సప్ సీజ్లు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనితో కొందరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్లకు, న్యూఢిల్లీలోని యుజిసి కార్యాలయాలకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనితో యుజిసీ సోషల్ మీడియా పోస్టింగ్లపై దృష్టిసారించింది.
ఎక్కడైనా సీనియర్ విద్యార్థులు ఇలాంటి అనధికార వాట్సప్ గ్రూప్లు ఏర్పాటుచేస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సమాచారం ఇచ్చింది. భౌతికంగా ర్యాగింగ్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయో వాటినే సోషల్ మీడియా వేధింపు ఘటనలకు కూడా వర్తింపచేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ర్యాగింగ్ జరిగినట్లు రుజువు అయితే ఆయా విద్యార్థులను కళాశాలల నుంచి బహిష్కరించడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Read also: hindi.vaartha.com
Read also: ISRO Makes History:ఘనత సాధించిన ఇస్రో