Justice: తీర్పుల్లో జాప్యంతో అందని న్యాయంతమకు జరిగిన అన్యాయాన్ని కోర్టుల దృష్టికి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని, తమను మోసం చేసిన వారికి తగిన శిక్ష పడాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అయితే మన దేశంలో కావల్సిన మేరకు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడంతో న్యాయం అనుకున్నంత త్వరగా లభించడం లేదు. న్యాయం సకాలంలో అందకపోవడం కూడా బాధితుడికి మరో అన్యాయం జరిగినట్లేనని ఆంగ్లంలో ఒక సామెత ఉంది.
ప్రస్తుతం ప్రజలకు న్యాయస్థానాల నుంచి అందే ఊరట అంతంత మాత్రంగానే ఉంటోంది. క్రిమినల్ కేసుల్లో సైతం తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సరాల తరబడి కోర్టుల(Courts)చుట్టూ బాధితులు తిరగాల్సి వస్తోంది. నీతిఅయోగ్ వ్యాఖ్యానించిన మేరకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉన్న కేసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తీర్పు (judgment) వెల్లడించడానికి కనీసం నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది. దేశవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకుపైగా కేసులు వివిధ స్థాయిలో విచారణ దశలోనే ఉన్నాయి.
కోట్లకుపైగా కేసులు పెండింగ్ లో
ప్రస్తుతం అందిన గణాంకాల ప్రకారం, సుప్రీంకోర్టులో సుమారు 85 లక్షలు, హైకోర్టుల్లో 62 లక్షలు, కిందికోర్టుల్లో సుమారు మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పది లక్షల మందికి కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 20 మంది కూడా ఉండటం లేదు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. కొన్ని కేసులు దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి.
వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. కొన్ని కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో మరో కోర్టుకు బదిలీ చేస్తున్నారు. అక్కడ కేసు దాదాపుగా మళ్లీ ముందునుంచి ప్రారంభం అవుతోంది. దీనితో మరి కొన్ని సంవత్సరాలు అదనంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
సామాన్యులు కోర్టుగురించి వ్యాఖ్యానిస్తూ ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వచ్చి భోరున ఏడుస్తాడని అంటూ ఉంటారు. గెలిచిన వారికి తమకు అందిన న్యాయం కంటే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం, భారీ మొత్తంలో ఖర్చు చేసుకోవడం వంటివి పట్టి పీడిస్తాయి.
హైదరాబాద్లో సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక కండక్టర్ తన విధి నిర్వహణ సమయంలో ఒక ప్రయాణికుడి నుంచి అదనంగా డబ్బు వసూలు చేశాడని కోర్టులో దావా దాఖలు అయింది. కోర్టు సదరు కండక్టర్ను నిందితుడిగా పేర్కొనడంతో విధులనుంచి తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ కేసు సుమారు 23 సంవత్సరాల పాటు కొనసాగింది.
అప్పటికి కండక్టర్ వయస్సు 60 సంవత్సరాలు దాటింది. అప్పుడు వచ్చిన తీర్పుతో అతనికి తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కోల్పోయాడు. అంతే కాకుండా అతను రెండు దశాబ్దాలు ఒక నిందితుడిగా అవమానాన్ని భరించాడు.జైళ్లకు వెళ్లిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. వీరికీ బెయిల్ ఇచ్చేవారు, డిపాజిట్లు కట్టేవారు లేకపోవడంతో వీరు జైలులోనే మగ్గుతూ ఉంటారు. విచారణలు వాయిదాల పరంపర కొన సాగిన తరువాత అతనికి జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువడుతుంది.
అనేక సందర్భాల్లో అతనికి పడిన శిక్ష కంటే అదనంగా జైలు జీవితాన్ని గడిపి ఉంటాడు. ఇక్కడ రెండు అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి దోషి తనకు పడిన శిక్ష కంటే అదనంగా జైలు జీవితాన్ని గడిపాడు. మరో అంశం జైలులో అతనికి అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉంటాయి.
కింది కోర్టులో జీవిత ఖైదు విధిస్తే అతను సుమారు పదేళ్లు జైలు జీవితం గడిపితే పై కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేస్తుంది. దీనికి కారణంగా త్వరతగతిన తీర్పులు రాకపోవడం. ఇటీవల రాష్ట్రపతి ముర్ము కూడా న్యాయస్థానాల్లో కొనసాగుతున్న విచారణ వాయిదా పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మనదేశంలో ప్రతి పదిలక్షల మందికి 20 మంది న్యాయమూర్తులు ఉంటే, అమెరికాలో 150 మందికిపైగా న్యాయమూర్తులు ఉన్నారు. దీనితో అక్కడ త్వరగా విచారణ పూర్తయి తీర్పులు వెలువడుతుంటాయి. ఈ విధంగా తీర్పులు త్వరగా వస్తే నేరాలు చేసే వారిలో కొంత భయం కలుగుతుంది.
ఏడాదిలో కోర్టులకు సుమారు వంద రోజులకుపైగాసెలవు
న్యాయస్థానాలకు ఆదివారాలు సహా ఏడాదిలో కోర్టులకు సుమారు వంద రోజులకుపైగా సెలవులుంటాయి. ఇవికాకుండా మరో 20 నుంచి 30 రోజులు ఇతర సెలవులు వర్తిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన న్యాయమూర్తుల పోస్టులో సుమారు ఆరు వేల వరకు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
దీనితో కొన్నికోర్టుల్లో న్యాయమూర్తులు రెండు, మూడు కోర్టులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. దీనితో న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతుంది. తీర్పు ఇచ్చే సమయంలో ఒత్తిడి లేకపోతేనే సరైన న్యాయం బాధితులకు అందుతుంది.
త్వరగా దావాను పరిష్కరించే ప్రయత్నం జరిగితే కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులను కల్పించినట్లు అవుతుంది. న్యాయవ్యవస్థలో పరిపాలనా వ్యవహరాలకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. న్యాయమూర్తులు, సిబ్బంది ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో తీర్పు వెలువడినా ఆ ఉత్తర్వులు బయటకు రావడానికి కొన్ని సందర్భాల్లో వారం, పది రోజులు పడుతుంది. ముఖ్యంగా జైల్లో ఉన్నా బెయిల్ మంజూరు అయినా కోర్టు నుంచి ఉత్తర్వులు జైలు అధికారులకు అందడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థకు ప్రాధాన్యత కల్పించి తీర్పులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Read also: hindi.vaartha.com
Read also: Wayanad landslide: ప్రకృతి ప్రకోపం వయనాడ్ విపత్తు