అభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్ష్యంగా సాగాల్సిన ప్రభుత్వాల పాలన ఓట్ల కోసం ఉచితాలను ప్రవేశపెట్టి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో విజయం సాధించేందుకు లెక్కకు మించిన హామీలు ఇచ్చిన పార్టీలు గద్దెనెక్కిన తరువాత వాటి అమలుకు భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు కేవలం ఆయా ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన వారి సంక్షేమానికి మాత్రమే ముడిపడి ఉండేవి. ఓటర్లు కూడా తమ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓట్లు వేసే వారు. అయితే మారిన పరిస్థితుల్లో ఏ పార్టీ తమకు ఏమేరకు ఉచితాలు ఇస్తోందన్న అంశంపై ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది.
ఓటర్ల మనోగతానికి అనుగుణంగా పార్టీలు కూడా ఉచితాలు, నగదు బదిలీలు అంటూ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేస్తున్నాయి. ముఖ్యంగా సిద్ధాంతాల స్థానంలో వ్యూహకర్తలు రంగప్రవేశం చేసిన తరువాత ఎన్నికల వ్యవహారశైలిలోనే మార్పు వచ్చింది. దీర్ఘకాలిక ప్రణాళికలను పక్కన పెట్టి కేవలం ఎన్నికల్లో ఎలా విజయం (success) సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రూపొందించడంతో సమాజానికి,ప్రభుత్వ ఖజానాకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఎదుటి పార్టీ ఉచితాలు ప్రకటించడంతో మరో పార్టీ కూడా అంతకు మించిన ఉచిత (Free) పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి వైఖరి వల్ల ఏమేరకు నష్టం జరుగుతుందో తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. అనేక పథకాలను రూపకల్పన చేసి ప్రతి వారం పది రోజులకు నగదు బదిలీలకు శ్రీకారం చుడుతున్నారు. వ్యవస్థలను మెరుగుపరచడం కంటే ఆయా వ్యవస్థలతో ప్రమేయం ఉన్న వారికి నేరుగా డబ్బు అందేలా చర్యలు తీసుకుంటున్నారు: దీని వల్ల దీర్ఘకాలంలో ఆయా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అప్పులు చేయనిదే రోజు గడవని స్థితి ఉంది.
అయినా ఇంకా ఉచితాలు కొనసాగించేందుకే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పథకాల అమలులో ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఖజానాలు గుల్ల అయ్యాయి. ప్రజలు కోరుకోని పథకాలను కూడా బలవంతంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని పక్కన పెట్టి రైతు భరోసా, రైతు బంధు వంటి పథకాలను అమలుచేస్తున్నారు.
మహిళలు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఏ మహిళా కోరుకోలేదు. అయినా తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో అమలుచేస్తామని చెబుతున్నారు. మహిళలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ విధంగా ఉచితాల రూపంలో కాకుండా ఉపాధి కల్పించడమో, లేక అదనపుఆదాయం కల్పించేందుకు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇతర ఉపాధి పథకాలను అమలుచేస్తే మహిళల్లో చైతన్యం కలగడమే కాకుండా రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
ఉచిత బస్సు ప్రయాణం
ఉచిత బస్సు ప్రయాణం అమలుచేసినా కొన్ని షరతులు, నిబంధలు ఉంటే సమంజసంగా ఉండేది. ఉచిత ప్రయాణం అమలుచేయడానికి ముందే బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉండేది. చాలా మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని అదుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఉచిత సౌకర్యంతో కొందరు అవసరం లేకపోయినా బస్సులు ఎక్కడం ప్రారంభించడంతో ఉపాధి కోసం వెళ్లే మహిళల పరిస్థితి అత్యంత దీనంగా మారింది. దళితబంధు కూడా ఆయాచిత మొత్తాలను ఇచ్చే పథకంగా పరిగణించాల్సి ఉంది. విద్యారంగానికి కూడా ఉచితాల బెడద తప్పడం లేదు. పాఠశాలలను అభివృద్ధి చేసి మెరుగైన విద్యను అందిస్తే నిరుపేదలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసీల వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది.
దీనికి బదులు వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదును జమ చేయడం వల్ల కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. ఉచితాలు, నగదు బదిలీలు వంటి పథకాలను నిలిపివేసి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మేథావులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తాను పన్నుల రూపంలో చెల్లించే మొత్తాలను వేరొకరికి ఉచితంగా ఇవ్వడమేమిటని పన్ను చెల్లింపుదారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని ప్రకటించింది. ప్రస్తుతం ప్రధానంగా పేర్కొన్న ఆరు హామీల అమలు గుదిబండగా మారింది. ఈ పథకాలు అమలుచేయాలంటే కనీసం 70 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఈసారి కొనసాగిస్తారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదు.
ఎన్ని ఉచితాలు, నగదు బదిలీలు అమలు చేస్తే ఆ మేరకు ఖజానాకు నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలుచేయడానికి ఒక దశ వరకే అవకాశం ఉంటుంది. 51 శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయరాదన్న నిబంధన ఉంది. ఆదాయంలో కూడా ఉచితాలకు, నగదు బదిలీలకు కొంత శాతానికి మించి ఖర్చు చేయకూడదన్న నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి పధకాలు అమలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టడం సర్వసాధారణంగా మారింది. పన్ను చెల్లింపుదారులు తాము కట్టిన పన్నులు సక్రమంగా వినియోగించుకోని ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి రావాలి. అప్పుడే ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
Read also: hindi.vaartha.com
Read also: Wayanad landslide: ప్రకృతి ప్రకోపం వయనాడ్ విపత్తు