📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Competitive exams: శాపంగా పోటీ పరీక్షల నిర్వహణ

Author Icon By Digital
Updated: June 20, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోటీ పరీక్షల(competitive exams) నిర్వహణలో పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతో అక్రమార్కులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఉన్నత స్థాయి విద్య కోసం నిర్వహించే ప్రవేశపరీక్షలు ఇటీవల కాలంలో ప్రహసనంగా మారాయి. పలుమార్లు దేశంలోని వివిధ న్యాయస్థానాలతో పాటు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి ఘటనలు దేశానికి నష్టం కలిగిస్తాయని వ్యాఖ్యానించాయి. అయితే పరీక్షల నిర్వహణలో లోపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా దేశస్థాయిలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షల భాగోతం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఇద్దరు ముగ్గురికి రావాల్సిన ర్యాంకులు ఏకంగా 67 మందికి రావడంతో పరీక్షల నిర్వహణలో లోపాలు వెలుగుచూశాయి.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇప్పటికి మూడు సార్లు నిర్వహించారు. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ముందుగానే వెల్లడి అయ్యాయి. అయితే దీనిపై వేసిన దర్యాప్తు కమిటీ లోతుగా పరిశీలన జరపకుండా కేవలం కిందిస్థాయి ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఒకరిద్దరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంది.

ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరిగినా ఆ కోణంతో దర్యాప్తు సంస్థలు దృష్టి సారించలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగే లోపాలకు సంబంధించి కీలక వ్యక్తులను ఇప్పటి వరకు న్యాయస్థానం ముందు నిలబెట్టిన సందర్భాలు లేవు. గతంలో ఎంసెట్ పరీక్షలు కూడా ఇదేవిధంగా అభాసుపాలు అయ్యాయి.

రాయలసీమకు చెందిన ఒక వ్యక్తి ఈ పరీక్ష పత్రాల వెల్లడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించేవాడని దర్యాప్తుల్లో తేలింది. ఎంసెట్ పరీక్షల లోపాలు వెల్లడి అయిన ప్రతిసారీ ఈ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించడం జరిగేది. ప్రింటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చేవి.

వైద్య విద్యను అభ్యసించాలనే పలువురు శ్రీమంతుల పిల్లలను గుర్తించి ఒక్కొక్క పేపర్ 50 లక్షల నుంచి కోటి రూపాయలకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ముందుగానే విద్యార్థులను తమ ఆధీనంలో తీసుకుని దూరప్రాంతాలకు తీసుకువెళ్లేవారు. పరీక్షల సమయంలో విమానాల్లో వారిని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చి పరీక్షలను రాయించే వారు.

ఈ తతంగం అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగేది. అయితే అధికారపార్టీలో ఉన్న కొందరి అండదండలతో పాటు ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారం కూడా లభించేది. పదేపదే ఈ సమస్య తలెత్తినా కొన్ని రోజులు హడావిడి చేయడం మళ్లీ ఈ విషయం మరుగున పడిపోవడం సర్వసాధారణంగా మారింది.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష నీట్ విషయంలో కూడా లోపాలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. నీట్ పరీక్షకు (Neet Exam) సంబంధించి వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులతో పాటు సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

విద్యార్థులు ప్రాథమిక స్థాయి దశ నుంచి తాము డాక్టర్లు కావాలని కలలు కంటారు. ఇంటర్ తరువాత ప్రత్యేక కోచింగ్లు తీసుకుని రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతారు. అదేవిధంగా గ్రూప్ పరీక్షలకు కూడా విద్యార్థులు తల్లిదండ్రులను, తమ స్వగ్రామాలను వదిలి నగరాలకు వచ్చి కోచింగ్ తీసుకుంటారు.

వీరిలో చాలామంది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉంటారు. వారి జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలన్న తపనతో ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణలో లోపాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తరువాత రెండు పరీక్షలు రద్దు అయ్యాయి.

గత ఆదివారం ముచ్చటగా మూడోసారి పరీక్షను తిరిగి నిర్వహించారు. సుమారు రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఇంత సుదీర్ఘకాలం ప్రభుత్వ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేసేవారిని, డాక్టర్లు, ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉంటే మొత్తం సమాజానికి చేటు జరుగుతుంది.

రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇంజనీరింగ్ కట్టడాలు దెబ్బతింటాయి. అడ్డదారిలో వచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో భర్తీ అయిన వారు విధి నిర్వహణలోనూ అడ్డదారిని ఆశ్రయిస్తారు.

2015లో ఒకసారి వైద్య ప్రవేశపరీక్షల పత్రాలు కూడా ముందుగానే వెల్లడి అయ్యాయి. ఆ సమయంలో పరీక్షలు రాసిన సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారు. అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.

అయితే రాజకీయ వత్తిడిలు, చట్టాల్లో లోపాల కారణంగా నిందితులు కొన్ని రోజుల్లోనే న్యాయస్థానం పరిధి నుంచి ఎలాంటి శిక్షలు లేకుండా బయటపడుతున్నారు. రాజకీయ అండ ఉన్న తమను చట్టాలు ఏమీ చేయలేవన్న ధీమా పెరగడంతో హైటెక్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి నేరాలకు పాల్పడుతున్నారు.

ఇకనైనా బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుంది. విద్యార్థులకు, అభ్యర్థులకు పరీక్షల నిర్వహణలపై భరోసా కలిగి ఆత్మస్థయిర్యంతో వ్యవహరించే అవకాశం కలుగుతుంది.

Read Also: Transportation sector: రవాణా రంగంలో పెనుమార్పులు

Breaking News in Telugu Competitive Exams Copying Mafia Education System Flaws Exam Irregularities Exam Malpractices Exam Management Issues Exam Paper Leak Google news Google News in Telugu Government Job Exams Group 1 Exam Latest News in Telugu NEET Controversy NEET Paper Leak NEET Scam Paper Telugu News Political Interference Question Paper Leak Student protests Supreme Court Petitions Telugu News Telugu News online Telugu News Today TSPSC Group 1 TSPSC Scandal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.