స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కువ మంది చెడు ప్రభావానికి, నేర ప్రవృత్తికి లోనౌతున్నారు. ముఖ్యంగా యువత, మైనర్లు స్మార్ట్ఫోన్(Smart phone) బారిన పడి భవిష్యత్తును అంధకారంగా మార్చుకుంటున్నారు. తెలిసీ తెలియని వయస్సులో స్మార్ట్ ఫోన్లో అభ్యంతరకరమైన వీడియోలు, విచ్చలవిడి నేర ప్రవృత్తితో కూడిన లఘు చిత్రాలు, వీడియో గేమ్స్ వంటివి వీక్షించడం వల్ల విచక్షణను కోల్పోతున్నారు. తాము చూసిన వీడియోలను ఫాంటసీగా భావించి తాము కూడా అదేవిధంగా చేయాలన్న తపనతో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి కటకటాల పాలౌతున్నారు. మరికొందరు తీవ్రమైన ఒత్తిడిని(stress) తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. నేరాలకు పాల్పడటం ద్వారా అమాయకుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో మైనర్ల(minor) భాగస్వామ్యం ఉన్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలో సంచలనం రేపిన నిర్భయ ఘటనలో ఒక మైనర్ సైతం మృగంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఇలాంటి పలు ఘటనలు గత ఐదారేళ్లుగా ఎన్నో జరిగాయి. ఇటీవల హైదరాబాద్లో ఒక మైనర్ బాలికపై నలుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి బెదిరించి ఆమెపై వరుసగా అత్యాచారాలు కొనసాగించారు. ఈ సమయంలో తాము చూసిన నీలిచిత్రాలను ఆమెకు చూపించి ఆ విధంగా తమతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఒక పాఠశాలలో విద్యార్థులు అసభ్య కదలికలతో నృత్యం చేసి దానిని వీడియో చిత్రీకరణ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో పది మంది విద్యార్థులను సస్పెండ్ చేసి టీసీలు ఇచ్చి పంపించారు. ప్రస్తుతం మైనర్లు పాల్గొంటున్న నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
2019లో బాలలపై సుమారు 33 వేల కేసులు నమోదు అయ్యాయి. 2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదు అయ్యాయి. 2022లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 4 శాతం వరకు మైనర్లు పాల్గొన్న కేసులు ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత తీక్షణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మైనర్లు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ముందుగా తల్లిదండ్రులతో ఘర్షణకు దిగుతుంటారు. ఫోన్‌ను గంటల తరబడి చూస్తూ కాలం గడుపుతుంటారు. తల్లిదండ్రులు వారించే ప్రయత్నం చేస్తే దాడి చేయడమో, ఇంటి నుంచి పారిపోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో వంటి విధానాలను అనుసరిస్తారు.
అందుకే తల్లిదండ్రులు ముందు నుంచే సెల్ఫోన్ వాడకంపై కొన్ని నిబంధనలు అమలు చేయాలి. దానిని అనుసరిస్తేనే ఫోన్ చూసేందుకు అనుమతి ఇవ్వాలి. ఫోన్లో మైనర్లు బాలురు దేనిని వీక్షిస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అనే విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడప్పుడు ఫోన్ తీసుకుని సెర్చింగ్ హిస్టరీ పరిశీలించాలి. ఫోన్ లాక్‌ను తల్లిదండ్రులకు తెలిసే విధంగా చూసుకోవాలి.
నీలి చిత్రాలు చూసే అలవాటుతో కొందరు చెడిపోతే కొన్ని రకాల గేమ్స్(games) ఆడటం వల్ల మరికొందరిలో నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. గతంలో కార్టూన్ సినిమాల్లో టామ్ అండ్ జెర్రీ చూసిన కొందరు పిల్లల్లో ఇతరులను టీజ్ (వేధింపులు) చేయడానికి ప్రయత్నించేవారు. దీనితో కొందరు తల్లిదండ్రులు ఈ కార్టూన్ చూడటానికి పిల్లలకు అనుమతి ఇచ్చే వారు కాదు. ప్రస్తుతం అంతకు మించిన వీడియోలు స్మార్ట్ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా గేమ్స్ ఆడేవారు కొందరైతే, ఎదుటి వారిపై దాడులు చేయడం వంటి విధానాలకు పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా బ్లూ వేల్ ఛాలెంజింగ్ గేమ్ అనేక మంది ప్రాణాలను తీసుకుంది. ఈ గేమ్ ముందు చాలా ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది, 50 రోజుల పాటు ఈ గేమ్ను ఆడాల్సి ఉంటుంది. ముందుగా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి, ఆడేకొద్దీ పిల్లల్లో ఆసక్తి పెంచే విధంగా ఉంటాయి.
20 రోజులు దాటిన తరువాత క్రమంగా ఛాలెంజెస్ హింసను ప్రేరేపించే విధంగా మారతాయి. బ్లేడ్తో గాయాలు చేసుకోవాలని, సూదులతో గుచ్చుకోవాలని ఛాలెంజెస్ వస్తుంటాయి. ముందు నుంచి తాము విజయం సాధిస్తూ వచ్చినందున ఇవి కూడా చేస్తే గేమ్ విజేతగా నిలబడతామన్న లక్ష్యంతో చిన్నారులు దీనిని అనుసరిస్తారు.
చివరకు ఆత్మహత్య చేసుకోవాలని గేమ్ వత్తిడి చేస్తుంది. మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకాలని, నదిలో దూకాలని, విషతుల్యమైన ఆహారాన్ని భుజించాలని ఛాలెంజెస్ వస్తాయి. గేమ్లకు అలవాటు పడి అందులో వచ్చే ఛాలెంజెస్ చేస్తూ వెళ్లిన పిల్లలు ప్రమాదాన్ని గుర్తించలేకపోతారు. ఈ సమయంలో వారు ఆత్మహత్య చేసుకుంటారు.
2018, 2019 సంవత్సరాల్లో బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ప్రపంచాన్నే ఛాలెంజ్ మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మనదేశంలో కూడా సుమారు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ప్రభుత్వం ఇలాంటి వీడియో గేమ్(video game) విషయంలో చర్యలు తీసుకున్నా మళ్లీ ఏదో రూపంలో ఇలాంటి గేమ్స్ ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారకముందే తల్లిదండ్రులు గమనించి వారిని హెచ్చరించకపోతే ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉంటాయి.
పిల్లలు తప్పుదారి పట్టిన తరువాత బాధపడటం కంటే ముందునుంచే జాగ్రత్తలు వహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.