ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజెవై) కింద ఇప్పటివరకు 68 లక్షలకుపైగా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించామనికేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. ఈ చికిత్సల మొత్తం విలువ రూ.13,000 కోట్లు కాగా, అందులో 76 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి అందినట్లు వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద 68 లక్షలకు పైగా క్యాన్సర్ పేషెంట్లకు రూ.13 వేల కోట్ల విలువైన చికిత్స అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. వీటిలో రూ.985 కోట్లకు పైగా విలువైన 4.5 లక్షలకుపైగా క్యాన్సర్ చికిత్సలు టార్గట్ థెరపీల ద్వారా అందించామన్నారు. అందులో 76 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయోజనాలన్నీ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజే వై ) కింద లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి జేపీ నడ్డా వివరించారు.
200పైగా ప్యాకేజీలు
ఈ పథకం కింద రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 200పైగా ప్యాకేజీలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఇందులో 500పైగా మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పాలియేటివ్ మెడిసిన్ విధానాలు ఉన్నాయన్నారు. వీటిలో సిఏ బ్రెస్ట్ కీమోథెరపీ, మెటాస్టాటిక్ మెలనోమా, క్రానిక్ మైలోయిడ్ లుకేమియా, బర్కిట్స్ లింఫోమా, సి ఏ లంగ్ వంటి టార్గెటెడ్ క్యాన్సర్ చికిత్సలకు 37 ప్యాకేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఆరోగ్య మంత్రి క్యాన్సర్ పేషెంట్ ఫండ్
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు ఆరోగ్య మంత్రి క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (హెఎచ్ ఎం సి పిఎఫ్ ) కింద రూ.15 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా జనరిక్ మెడిసిన్ (మందులను) దాదాపు 217 అమ్రిత్ ఫార్మసీల ద్వారా 50-80 శాతం డిస్కౌంట్ ధరకే అందిస్తున్నట్లు వివరించారు. మొత్తం 289 ఆంకాలజీ మందులను మార్కెట్ ధరలో సగం ధరకే అందిస్తున్నామన్నారు.
డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు
ఇక 2025-26లో జిల్లా ఆసుపత్రులలో 200 డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినట్లు నడ్డా చెప్పారు. అధునాతన క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాలలో 19 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు, 20 తృతీయ క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.