భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో గొప్ప పోరు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్. అయితే ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ కనిపించే అవకాశం లేదని, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అతని చివరి ఐసీసీ టోర్నమెంట్ కావొచ్చని అభిప్రాయపడ్డారు.
సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ
ఈఎస్ పిఎన్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, “రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అతని వయసును దృష్టిలో ఉంచుకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అతనికి చివరి ఐసీసీ టోర్నమెంట్ కావొచ్చు” అని వ్యాఖ్యానించారు. అయితే రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మంజ్రేకర్ వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి.అంతేకాకుండా, మంజ్రేకర్ రోహిత్ బ్యాటింగ్ స్టైల్‌ను పొగడ్తలతో ముంచేశారు. “2023 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ తన ఆటతీరు ద్వారా ప్రజాదరణ పెంచుకున్నాడు. అతని ప్రత్యేకత ఏమిటంటే, అతను నిస్వార్థంగా ఆడతాడు. తన వ్యక్తిగత రికార్డుల గురించి పట్టించుకోకుండా, జట్టుకు మంచి ఆరంభం అందించడంపై దృష్టి పెడతాడు. అతని ధాటిగా ఆడే శైలి యువ ఆటగాళ్లకు మేటి ఆదర్శం” అని మంజ్రేకర్ అన్నారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఏప్రిల్‌లో 38 ఏళ్లు నిండుతాయి. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయస్సు 40 సంవత్సరాలు దాటుతుంది. రోహిత్ టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతనికి తదుపరి ఐసీసీ టోర్నమెంట్ 2027 వన్డే ప్రపంచ కప్ అవుతుంది. రోహిత్ మనసులో ఏముందో అతనికి మాత్రమే తెలుసు. మిగిలినవన్నీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. అది వయస్సు విషయమైతే అది పట్టింపు లేదు. ఎందుకంటే రోహిత్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది.
హాట్ టాపిక్
రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడా? లేదా 2027 వరల్డ్ కప్ వరకూ కొనసాగుతాడా? అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అయితే రోహిత్ టీ20 ఇంటర్నేషనల్ నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి వన్డేల్లో ఎంతకాలం కొనసాగుతాడో చూడాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి. కానీ ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో అతని అద్భుతమైన ఫామ్, ఇప్పటికీ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉండటంతో అతను త్వరగా రిటైర్ అవుతాడా? అనే ప్రశ్నలపై స్పష్టత లేదు. మరి రోహిత్ స్వయంగా దీనిపై ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.