హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మా ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం, అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
బడ్జెట్ – ఉగాది షడ్రుచుల మాదిరి
ఇటీవల రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బడ్జెట్ ఉగాది పచ్చడి మాదిరిగా అన్ని రంగాలను సమతుల్యంగా కవర్ చేస్తూ, సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది, అని అభివర్ణించారు. ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, పేదవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కొన్ని అడ్డంకులు రావడం సహజమని, కానీ వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు శాంతి భద్రతలు అవసరమని, ప్రభుత్వం ఆ దిశగా నిరంతరంగా శ్రమిస్తోందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, హైదరాబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనేక ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా ఆర్థిక, వాణిజ్య, ఐటీ, పరిశ్రమల రంగాల్లో భారీ ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
సన్నబియ్యం పంపిణీ
రాష్ట్రంలో ఈ ఏడాది విపరీతంగా వరి పండిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో కూడా ఇంత వరి ఉత్పత్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా వెల్లడించారు. తెలంగాణ రైతుల కృషిని గౌరవించేందుకు, రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మన రైతులు పండించిన అన్నాన్ని మన పేదల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాం, అని చెప్పారు. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, ప్రజలకు పోషకాహారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమతుల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని సీఎం తెలిపారు. మన రైతులు పండించిన పంటను పేదలకు పంచబోతున్నామని చెప్పారు. ఐటీ రంగంలో కొత్త అవకాశాలు, పారిశ్రామిక ప్రగతి, విద్య, వైద్య ఆరోగ్య రంగాల బలోపేతం, వ్యవసాయానికి మరింత మద్దతు, మహిళా సాధికారత కోసం ప్రత్యేక ప్రణాళికలు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును వెలుగొందించే ముఖ్యాంశాలుగా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఉగాది వేడుకల్లో సీఎం స్పీచ్ తెలంగాణ అభివృద్ధికి కొత్త మార్గాన్ని సూచించింది.