Revanth Reddy : జెడ్పీటీసీగా గెలిచినప్పుడే ఆనందం కలిగింది: రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కీలక వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి పదవి కన్నా, జెడ్పీటీసీగా గెలిచినప్పుడే తనకు నిజమైన ఆనందం కలిగిందని తెలిపారు. మొదటిసారి వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కారుణ్య నియామకాల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే అనేక మంది పది సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు కారుణ్య నియామకాలు కూడా చేపట్టాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర అసాధారణమైనదని గుర్తు చేశారు. స్వయం పాలన వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు పోటీ పరీక్షలకు ఎక్కువగా సిద్ధమవుతున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని, వారి కోసం సంకల్పంతో పని చేస్తోందని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడమే వారి ఓటమికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. “ఉద్యోగాలు ఇవ్వని వారికి ఓట్లు ఎందుకు” అనే ప్రశ్నతో యువత బీఆర్ఎస్‌కు గట్టి మెస్సేజ్ ఇచ్చిందని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉద్యోగ ఖాళీలు పెండింగ్‌లో పెట్టొద్దని ఇప్పటికే ఆదేశించానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. “పరీక్షలు నిర్వహించాక, నెలల తరబడి ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి, ఉద్యోగాలను అందిస్తాం” అని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, ఈసారి యువత మోసపోవదని స్పష్టం చేశారు.