హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్‌లోకి దిగి దూసుకుపోతోంది. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని సమస్య ఎక్కడుంటే అక్కడ టెంట్ వేసుకుని మరీ పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం (ఫిబ్రవరి 07న) రోజున అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి ప్లాట్ల యజమానుల ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చిన రంగనాథ్‌కు, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది.

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించటమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మొదట్లో కాస్త వ్యతిరేకత వల్ల విమర్శలు ఎదుర్కొన్నా ఇప్పుడు ప్రజల మద్దతుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే హైడ్రా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో అధికారులు త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో రంగనాథ్ పర్యటించారు.మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్‌నగర్, చక్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులతో రంగనాథ్ సమావేశమయ్యారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు ప్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతానని బాధితులకు భరోసా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఐలాపూర్ గ్రామవాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది. బాధితుల సమస్యలు వింటున్న సమయంలో సుప్రీకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు.
కోర్టు పరిధిలో ఉన్న దాన్ని చూసేందుకు ఎందుకు వచ్చారని కమిషనర్‌ను ముఖీం ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్లాట్లకు సంబంధించిన పలు ఆధారాలు కమిషనర్ రంగనాథ్‌కు చూపిస్తూ.. “మీరు తెలుగు చదువుతరు కదా” అని ముఖీం అడిగారు. దానికి స్పందించిన రంగనాథ్ “నేను తెలుగు చదువుతా అన్ని చదువుతా కానీ మీరు చెప్పేది చెప్పండి. ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సింది చెప్పండి. ఓవర్ యాక్షన్ చేయకండి. మీరు ఓవరాక్షన్ చేశారనుకోండి అనవసరంగా ఇబ్బందులు పడతారు” అంటూ సీరియస్ అయ్యారు. హైడ్రా అనేది ఒక వ్యవస్థ అని అది ప్రజల ఆస్తులను కాపాడేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే పని చేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.