మద్యం విషయంలో రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తేల్చి చెప్పారు. ప్రజారోగ్యం కాపాడేందుకు మద్యం విధానంలో పూర్తి పారదర్శకత ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం, కీలక ఆదేశాలు జారీ చేశారు.నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాస్పద బ్రాండ్ల విక్రయాలను వెంటనే నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యమైన మద్యం (Alcohol) మాత్రమే విక్రయించాల్సిందని స్పష్టం చేశారు.

గత పాలనలో ప్రజారోగ్యం దెబ్బతిన్నది
గత ప్రభుత్వ హయాంలో నకిలీ బ్రాండ్లు విస్తృతంగా అమ్ముడయ్యాయని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర ఆదాయం రెండూ నష్టపోయాయని చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య మద్యం విధానాన్ని విశ్లేషించి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం ఏపీ మార్కెట్‌లో ఉన్న మద్యం అన్నీ నాణ్యమైనవే అని అధికారులు తెలిపారు. 68 శాతం వరకు నాసిరకం బ్రాండ్లే గతంలో అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ధరల తగ్గింపు – వినియోగదారులకు ఊరట
దేశంలో తొలిసారిగా మద్యం ధరలు తగ్గినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీని వల్ల నెలకు రూ.116 కోట్లు ప్రజలపై భారం తగ్గిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. పర్మిట్ రూమ్‌లు ఇవ్వాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మద్యం సరఫరాపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. డ్రోన్‌లతో నాటు సారా తీయడాన్ని కట్టడి చేయాలని చెప్పారు. బెల్ట్ షాపులకు ఎలాంటి వెసులుబాటు ఉండదని తేల్చిచెప్పారు.
మద్యం విధానంలో కొత్త దారులు
పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. మద్యం సరఫరా క్రమబద్ధీకరణతోపాటు, ఆదాయంలో మెరుగుదల వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also : AP Forest Department: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల