ఆరోగ్య, వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం (Policies ) ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ పాలసీలపై ప్రస్తుతం విధించే 18% జీఎస్టీని మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బీమా రంగంపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయని, త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌కు దీనిపై ఒక నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం అమలయితే, బీమా పాలసీలు సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి.
పన్ను రాబడి తగ్గినప్పటికీ ప్రజలకు మేలు
బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.9,700 కోట్ల పన్ను రాబడి తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రజల ఆరోగ్య భద్రత, ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవశ్యకత పెరిగిన నేపథ్యంలో, ఈ నిర్ణయం కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రీమియం భారం తగ్గడం వల్ల ఎక్కువ మంది ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తారు.
అందరికీ అందుబాటులో ఆరోగ్య బీమా
ఈ ప్రతిపాదన అమలైతే, ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. ప్రస్తుతం అధిక ప్రీమియంల కారణంగా బీమా పాలసీలను తీసుకోలేని వారు కూడా భవిష్యత్తులో ఈ పథకాలను సద్వినియోగం చేసుకోగలరు. ఈ నిర్ణయం దేశంలో ఆరోగ్య బీమా కవరేజీని పెంచడమే కాకుండా, ప్రజల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే, త్వరలోనే బీమా ప్రీమియంలు తగ్గుముఖం పడతాయి.