మావోయిస్టు కీలక నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు

Police Arrests Maoist Prime Leader Sujatha in Kothagudem

ఖమ్మం: వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో రూ.కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుజాత బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అక్టోబర్‌ 4న ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌-కోబ్రా, ఎస్‌టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నారాయణ్‌పూర్‌ జిల్లా ఓర్చా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నెండూర్‌-తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 6వ కంపెనీ, తూర్పు బస్తర్‌ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి నీతి అలియాస్‌ ఊర్మిలతో పాటు డివిజినల్‌ కమిటీ సభ్యులు సురేశ్‌ సలాం, మీనా మడకం ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *