అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కొన్ని గంటల పాటు మంత్రిమండలి నిర్ణయాలను వివరించారు.
వివిధ శాఖలు రూపొందించిన నూతన పాలసీలపై ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలక ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
20 లక్షల ఉద్యోగాలు కల్పన, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ 4.0ని రూపొందించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారు. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీల నియామకం పైనా కేబినెట్ లో చర్చించినట్లు తెలిపారు.