ప్రయాగరాజ్: ప్రధాని మోడీ ఈరోజు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 10గంటలకు ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్తారు.

ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయలుదేరివెళ్తారు. ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోడీ పాల్గొనరని సమాచారం. మోడీ వస్తున్న నేపథ్యంలో నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్ తోపాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
కాగా, మహా కుంభమేళా ప్రారంభం కాకముందే వివిధ కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.