10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయం సమస్య గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్ చేశారు. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయని ప్రధాని తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు
ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం కేసులు పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. “ఫిట్ అండ్ హెల్తీ దేశంగా మారాలంటే.. మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. మరింత ఆందోళనకర విషయం ఏంటంటే..? పిల్లల్లో ఊబకాయ సమస్య నాలుగు రెట్లు పెరిగింది” అని ప్రధాని మోడీ తెలిపారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారన్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలి
ఇది చాలా ఆందోళనకర అంశమని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని సూచించారు. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోడీ నామినేట్ చేశారు.