అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మేఘనీనగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలోని జనావాసాలపై కుప్పకూలింది. విమానం ప్రయాణంలో ఉన్నంతసేపూ అంతా సవ్యంగా ఉన్నప్పటికీ టేకాఫ్ అనంతరం హఠాత్తుగా ఎటీసీతో సంబంధం తెగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించగా, జనావాసాలపై కూలిన విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు
విమాన ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ తక్కువ కాలంలోనే టేకాఫ్ చేసిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు.
మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన
ఈ ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటికే ఘటనాస్థలిలో ఉన్నాయి. 90 మంది చొప్పున మూడు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. హుటాహుటిన అహ్మదాబాద్ తరలివెళ్తునట్లు రామ్మోహన్ నాయకుడు పేర్కొన్నారు.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు
ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రాణనష్ట వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
Read also: Air India: అహ్మదాబాద్‌లో కుప్ప కూలిన ఎయిరిండియా విమానం..కొనసాగుతున్న సహాయం