ఆ పిటీషన్లకు ఓ పరిమితి ఉండాలి..
న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పై ఇంకా పిల్స్ దాఖలు అవుతున్నాయి. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ కేసులు ఫైల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం .. ప్రార్థన స్థలాల చట్టం అమలుపై వాదనలు చేపట్టింది.

ఏప్రిల్ మొదటి వారంలో విచారణ
మధ్యంతర పిటీషన్లు ఎక్కువ కావడంతో ఈరోజు ఆ కేసును విచారణకు స్వీకరించలేమన్నారు. త్రిసభ్య ధర్మాసనం ముందు మరీ ఎక్కువ సంఖ్యలో పిటీషన్లు ఉన్నాయని, ఈ కేసును మళ్లీ ఏప్రిల్ మొదటి వారంలో విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది. మధ్యంతర పిటీషన్లు వేయడానికి ఓ పరిమితి ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.
ప్రార్థనా స్థలాల విషయంలో సుదీర్ఘకాలంగా వివాదాలు
కాగా, ఈ అంశంలో ప్రధానమైన చర్చ అంతా సెక్షన్ 3, 4 మీద ఆధారపడి ఉంది. ఆ సెక్షన్లు కోర్టు ధార్మిక స్వభావాన్ని నిర్వచించి, దాన్ని మార్చేయడాన్ని నిలువరిస్తాయి. అలాగే కోర్టు పరిధిని కూడా పరిమితం చేస్తాయి. దేశంలోని పలు మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల విషయంలో సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్న సంగతిని ప్రస్తావిస్తూ… జ్ఞానవాపి మసీదు కమిటీ సహా ముస్లిం పక్షాలు… ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తున్న పిటిషన్లను కొట్టేయాలని వాదిస్తున్నాయి.