Supreme Court : సుప్రీంకోర్టు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాక..సబర్మతి ఆశ్రమం ఆధునికీకరణ అంశం భావోద్వేగాలతో ముడిపెట్టొద్దని సూచించింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని రూ.1200కోట్లతో ఆధునికీకరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని 2022లో గుజరాత్ హైకోర్టు సమర్థించింది. అయితే తుషార్ గాంధీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టవద్దు
గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టు ఆశ్రమం టోపోగ్రఫీ మారిపోతుందని నైతికత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టవద్దు. మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దేశం ముందుకు వెళ్తోంది. ఇలాంటి అంశాలను ఇతర కోణాల్లో చూడాలి అని కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది.
ఈ ప్రణాళికలో 40 పురాతన కట్టడాలను మాత్రమే
కాగా, గుజరాత్ ప్రభుత్వం 2019లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రపంచ స్థాయి మ్యూజియం మరియు పర్యాటక గమ్యంగా మార్చేందుకు పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో 40 పురాతన కట్టడాలను మాత్రమే ఉంచి, మిగతా 200 నిర్మాణాలను కూల్చి పార్కులు, పార్కింగ్ స్థలాలు, ఫలహారశాల, చంద్రభాగ నది ప్రవాహ పునరుద్ధరణ వంటి అంశాలను చేర్చాలని సూచించారు. తుషార్ గాంధీ ఈ ప్రణాళికను గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, ఆశ్రమం సహజత్వాన్ని హానికరంగా భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.