జమ్ముకశ్మీర్ సీఎం అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఎన్సీ-కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఒమర్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ (BJP) 28 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. ఇక పీడీపీ అయితే కేవలం 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఆధిక్యం మెజారిటీ మార్కును దాటడంతో జమ్ముకశ్మీర్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.
ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. కాగా, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకు కూడా జమ్ముకశ్మీర్ సీఎంగా పనిచేశారు.