Nitin Gadkari : ద్విచక్ర వాహనదారులకు కేంద్ర ప్రభుత్వ కీలక ఆదేశం దేశంలో ప్రతి ఏడాది 69,000కి పైగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ ప్రమాదాల్లో సగానికి పైగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి ద్విచక్ర వాహన విక్రేత తన కస్టమర్లకు బైక్ లేదా స్కూటర్‌తో పాటు రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లు అందించాల్సిందే.మంత్రి నితిన్ గడ్కరీ తాజా నిర్ణయాన్ని ‘టూ వీలర్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (THMA) పూర్తిగా స్వాగతించింది.

ఈ నిర్ణయం వాహనదారుల భద్రతను మరింత బలోపేతం చేస్తుందని, ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుతుందని పేర్కొంది.ఇప్పటివరకు చాలా మంది వాహనదారులు హెల్మెట్‌ను ఇష్టానుసారంగా వాడేవారు. అయితే, ఇకపై ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే వ్యక్తికి బైక్ లేదా స్కూటర్‌తో పాటు రెండు హెల్మెట్లు కూడా ఇవ్వడం తప్పనిసరి కానుంది. దీంతో డ్రైవర్‌తో పాటు సవారీగా వెళ్తున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది.ద్విచక్ర వాహన ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణంగా మారింది. సరైన రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.