ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) సంస్థ మార్చి 29న ఈ నియామకానికి సంబంధించిన ఒక ఉత్తర్వును జారీ చేసింది. నిధి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని తెలిపింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని డీఓపీటీ పేర్కొంది. ఇప్పటి వరకు నిధి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ఉప కార్యదర్శి (డిప్యూటీ సెక్రటరీ)గా పని చేస్తున్నారు. ఆమె నియామకం కో టర్మినస్ ఆధారంగా జరిగింది. కో టర్మినస్ అంటే ప్రధానమంత్రి పదవీకాలం ముగిసేంతవరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉండే పదవీకాలం. ఇప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా ఆమె ప్రధాని మోదీ రోజువారీ పరిపాలనా పనులను చూస్తారు. అంటే రోజువారీ షెడ్యూల్‌ను నిర్వహించడం, పాలసీ, పాలనా సమన్వయం, కమ్యూనికేషన్ వంటివి ఆమె పర్యవేక్షిస్తారు.

నిధి తివారీ ఐఎఫ్‌ఎస్ అధికారి
నిధి తివారీ, 2014 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 96వ ర్యాంకు సాధించారు. ప్రైవేట్ సెక్రటరీగా నియామకానికి ముందు ఆమె గత రెండున్నరేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. ఉప కార్యదర్శిగా విదేశాంగ, భద్రతా అంశాలకు చెందిన కీలక విభాగాలను ఆమె నిర్వహించారు. దీనికంటే ముందు, నిధి తివారీ 2022 నవంబర్‌లో అండర్ సెక్రటరీగా పీఎంఓలో చేరారు. ”సర్వీస్‌లో రకరకాల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఇది చాలా పెద్ద బాధ్యత. నిధి చాలా కష్టపడుతుంది. ఈ బాధ్యత స్వీకరించడానికి ఆమె ఉత్సాహంగా ఉంది” అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ సుశీల్ జైస్వాల్ అన్నారు. పీఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో పని చేశారు.
