మా ప్రభుత్వం ఏర్పడి ఒక్కరోజు కూడా గడవలేదని, కానీ అప్పుడే విమర్శలు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయని, ఇన్నేళ్లు ఏం చేశారో చూసుకోవాలని హితవు పలికారు. కానీ తాము పీఠం ఎక్కి ఒకరోజు కూడా కాలేదు, తమపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు.
రూ.10 లక్షల మేరకు వైద్య సాయం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజే తాము కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయుష్మాన్ భారత్ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. దీంతో ప్రజలకు రూ.10 లక్షల మేరకు వైద్య సహాయం అందుతుందని తెలిపారు. ప్రజలకు రూ.10 లక్షల విలువ చేసే వైద్య సహాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు.

ప్రశ్నించే హక్కు లేదు
పదమూడేళ్లు ఏమీ చేయని వారికి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీ తన హక్కులన్నింటినీ పొందుతుందని అన్నారు. ముందు మీరు మీ పార్టీ గురించి చూసుకోవాలని హితవు పలికారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎంతోమంది వీడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో పెడితే అన్ని విషయాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకాన్ని మొదటి కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ మొదటి రోజు దానిని ఉల్లంఘించిందని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఆరోపించారు. అతిషి విమర్శలకు ముఖ్యమంత్రి పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.