యోగి ఆదిత్యనాథ్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలు, సోషల్ మీడియా వేదికల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. మోదీ రాజకీయ సన్నివేశం నుంచి తప్పుకుంటారని, ఆయన తర్వాత ప్రధాని పదవి కోసం యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వస్తుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి ప్రచారాల నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన స్థానం పై స్పష్టతనిచ్చారు. తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రినని, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు సేవ చేయడానికి పార్టీ తనను ఇక్కడ నియమించిందని చెప్పారు. తాను పూర్తిగా రాజకీయ వ్యక్తి కాదని, తన ప్రధాన లక్ష్యం యూపీలోని ప్రజలకు మంచి పాలన అందించడమేనని తెలిపారు. తాను యోగిని మాత్రమేనని, రాజకీయాలు తన పూర్తి స్థాయి వృత్తి కాదని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో విభేదాలు ఉంటే తాను ఈ స్థాయిలో కొనసాగగలడా? అంటూ ప్రత్యక్షంగా ఈ ప్రచారాలను ఖండించారు.
ఇదే సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భవిష్యత్ కార్యచర్యల గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రాజకీయ వర్గాల్లో ఆయన సార్వత్రిక ఎన్నికల తర్వాత పక్కకు తప్పుకుంటారని, పార్టీ నాయకత్వ బాధ్యతలను కొత్త వారికే అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మోదీ స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ శ్రేణుల్లో యోగికి మద్దతు ఎక్కువగా ఉండటం, ఆయన హిందుత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
యోగి ఆదిత్యనాథ్ స్టేట్‌మెంట్ – మోదీ తర్వాత?
తాను కేవలం యూపీ సీఎం మాత్రమేనని, తాను రాజకీయాల్లో ఉంటే అది పార్టీ నడిపిన విధంగా ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కేంద్ర నాయకత్వంతో విభేదాలు ఉంటే తాను ఈ స్థాయిలో ఉండగలడా? అని ప్రశ్నించటం గమనార్హం. ఈ మాటల ద్వారా ఆయన బీజేపీ అధిష్టానంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. ఆయన ప్రకటనతో మోదీ రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు కొంతవరకు తెరపడినట్టయింది.
అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాలే ప్రధానమైనవి. ఎవరికి టికెట్ ఇవ్వాలో, ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలో ఆ బోర్డే నిర్ణయిస్తుందని యోగి అన్నారు. ఈ మాటల ద్వారా ఆయన తన రాజకీయ భవిష్యత్తును పార్టీ నిర్ణయాలపై వదిలేశారని స్పష్టమవుతోంది.