వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్నకు చివరికి సమాధానం దొరికింది. మద్రాసు హైకోర్టు (Madras High Court) మదురై ధర్మాసనం ముందు నిత్యానంద శిష్యురాలు అర్చన (Archana, a disciple of Nithyananda) ఓ కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of Kailasa – USK) అనే ప్రత్యేక దేశంలో నివసిస్తున్నట్టు వెల్లడించారు.మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించరాదంటూ ఓ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌కు సంబంధించి విచారణ జరిగింది. నిత్యానంద తరఫున శిష్యురాలు అర్చన కోర్టులో హాజరై, నిత్యానంద స్థితిగతులను వివరించారు.
కైలాస గురించి క్లారిటీ ఇచ్చిన అర్చన
అర్చన కోర్టుకు చెప్పిన ప్రకారం, నిత్యానంద ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసలో స్థిరపడిపోయారు. ఇది తానే స్వయంగా ఏర్పాటు చేసుకున్న దేశమని పేర్కొన్నారు. గతంలో నిత్యానంద కైలాస అనే దేశాన్ని ప్రకటించడంతో, “అది ఎక్కడ ఉంది?”, “అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరమా?” వంటి అనేక సందేహాలు వచ్చాయి. ఇప్పుడు అర్చన తెలిపిన సమాచారంతో కొంత స్పష్టత వచ్చింది.
న్యాయవాది మారుస్తున్న నిత్యానంద
వీటితో పాటు, నిత్యానంద తరఫున న్యాయవాదిని మార్చుకునేందుకు అనుమతి కోరారు. దీనికి ధర్మాసనం సానుకూలంగా స్పందించి, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామంతో నిత్యానంద, ఆయన కైలాస మళ్లీ వార్తల్లో నిలిచాయి.ఇంతకాలంగా నిత్యానంద ఎక్కడ ఉన్నాడనే ఉత్కంఠ కొనసాగింది. ఇప్పుడు మాత్రం, ఆయన కైలాస దేశంలో ఉన్నారని శిష్యురాలే చెప్పడంతో ఆ ఉత్కంఠకు కొంత వరకు తెరపడింది. అయితే, ఈ దేశం నిజంగా ఉన్నదా? అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందా? అన్న ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది.
Read Also : Nita Ambani : బల్కంపేట అమ్మవారికి నీతా అంబానీ కోటి రూపాయల విరాళం