Yogi Adityanath education : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వృత్తి విద్యలో దక్షిణాది సహా పలు భారతీయ భాషలను చేర్చినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలను ఈ కార్యక్రమంలో భాగం చేశామని ఆయన పేర్కొన్నారు.
వారాణసిలో నిర్వహించిన కాశీ తమిళ సంగమం 4.0 ప్రారంభ వేడుకలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా ఈ భాషలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చని, దానికి సంబంధించిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాశీ తమిళ సంగమం కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామేశ్వరం, మదురై, కన్యాకుమారికి వెళ్తున్నారని గుర్తు చేస్తూ, ఈ పుణ్యక్షేత్రాలకు తక్కువ ధరలతో ప్రత్యేక పర్యటన ప్యాకేజీలను పర్యాటక శాఖ నిర్వహిస్తుందని ప్రకటించారు.
Latest News: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్
ఈ కార్యక్రమం దేశ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టినట్లేనని యోగి అన్నారు. కాశీ తమిళ సంగమం భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా మారిందని పేర్కొన్నారు. కాశీ–తమిళ సంప్రదాయాల మధ్య ఉన్న పురాతన బంధానికి భగవాన్ శివుడు కేంద్రబిందువని, ఆ బంధాన్ని ఆదిశంకరాచార్యులు దేశ నలుమూలల పీఠాల స్థాపన ద్వారా మరింత విస్తరించారని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ పర్యటన ద్వారా కాశీలో శివ భక్తిని, ప్రయాగ్‌రాజ్ సంగమాన్ని, అయోధ్యలో ధర్మధ్వజారోహణను దర్శించడంతో పాటు రాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య సాంస్కృతిక, విద్యా, ఆర్థిక, ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ దేశానికి మంచి భవిష్యత్తును అందిస్తోందని చెప్పారు.
ఈ ఏడాది తమిళనాడులోని తేన్కాసి నుంచి ప్రారంభమైన కార్ ర్యాలీ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని యోగి పేర్కొన్నారు. ఈ 2,000 కిలోమీటర్ల ప్రయాణం కాశీతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తుందని అన్నారు.
దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన మహర్షి అగస్త్య, (Yogi Adityanath education ) ఆదిశంకరాచార్య, తిరువళ్లువర్, రామానుజాచార్య, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావులు దేశమంతటా జ్ఞానదీప్తిని పంచారని యోగి గుర్తు చేశారు. తమిళ నాగరికతలోని శైవ–వైష్ణవ భక్తి సంప్రదాయాలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయని అన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయానికి గత 200 ఏళ్లుగా చెట్టియార్ వర్గం పూజాసామగ్రిని అందిస్తోందని, రామేశ్వరం శ్రీరామనాథస్వామి దేవాలయానికి సంగమ జలాలు, కాశీ విశ్వనాథుడికి కొడితేర్థం జలాలు సమర్పించే సంప్రదాయం నేటికీ కొనసాగుతుందని చెప్పారు.
ప్రధాని నేతృత్వంలో కాశీ విశ్వనాథ ధామ్ అభివృద్ధి దేశ ఆధ్యాత్మిక శక్తిని పునరుజ్జీవింపజేసిందని యోగి అన్నారు. గత నాలుగేళ్లలో 26 కోట్లకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని, అందులో అత్యధిక సంఖ్య తమిళనాడు నుంచి వచ్చిన వారేనని ఆయన తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/