విమాన ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా, ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ ఓ కొత్త సేవను ప్రారంభించింది. ‘మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్‘ పేరుతో తీసుకురాబడిన ఈ పథకం ముంబై నగరానికి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగంగా, ఉబర్ క్యాబ్ లో ప్రయాణించి విమానాశ్రయానికి వెళ్తున్న ప్రయాణికుడు విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఉబర్ పూర్తి వివరాలు
ఉబర్ ఈ ప్రయాణ భీమా పథకాన్ని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకురావడం గమనార్హం. ఈ సేవ ద్వారా ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు అందుతాయి: విమానాన్ని మిస్ అయితే ఆర్థిక భరోసా ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైనా రక్షణ ఆపత్కాలంలో వైద్య ఖర్చుల భరణం విమాన టికెట్ రీప్లేస్‌మెంట్ సౌకర్యం ఉబర్ క్యాబ్ ద్వారా విమానాశ్రయానికి వెళ్లాలి.విమానాన్ని మిస్ అయితే క్లెయిమ్ చేయవచ్చు.దానికి సంబంధించి కొన్ని నిబంధనలు అమల్లో ఉంటాయి: అవసరమైన పత్రాలు సమర్పించాకే భీమా మొత్తాన్ని పొందగలరు. రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు క్లెయిమ్ ఫారమ్ సమర్పించాలి. మిస్ అయిన ఫ్లైట్ టికెట్, తిరిగి బుక్ చేసుకున్న టికెట్ వివరాలను అందించాలి.
ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం
ఉబర్ ఈ కొత్త సేవను తీసుకురావడానికి ప్రధాన కారణం ముంబై నగరంలోని భారీ ట్రాఫిక్ సమస్య. దేశంలోనే అత్యధిక రద్దీగల విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు నగరం నలుమూలల నుండి ఇక్కడికి చేరుకుంటుంటారు. అయితే ట్రాఫిక్ సమస్యల కారణంగా చాలా మంది తమ విమానాలను మిస్ అవుతున్నారు. అందుకే, ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి ఉబర్ ఈ ‘మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్’ సేవను ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. సాధారణంగా విమానాన్ని మిస్ అయితే కొత్త టికెట్ కొనాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టికెట్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇప్పుడు ఉబర్ తీసుకువెళ్లిన ప్రయాణికులు విమానం మిస్ అయితే 7,500 రూపాయల వరకు పరిహారం పొందే వీలుంది. ప్రస్తుతం ఈ పథకం ముంబై నగరానికి మాత్రమే పరిమితం అయినప్పటికీ, త్వరలోనే దేశవ్యాప్తంగా బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉబర్ పలు రకాల ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. తాజా ‘మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్’ పథకం ద్వారా ప్రయాణికుల నష్టాన్ని తగ్గించేందుకు మరో ముందడుగు వేసింది.