ఢిల్లీలో (In Delhi) విలాసవంతమైన ప్రాంతాల్లో ఖరీదైన కార్లు దొంగల ముఠా (Car thief gang) లక్ష్యంగా మారాయి. హ్యుందాయ్ క్రెటా, ఫార్చ్యూనర్, బ్రెజా వంటి ఎస్‌యూవీలు ఈ ముఠాకు ప్రధాన టార్గెట్. ఈ దొంగతనాల వెనుక ఒక కుటుంబం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కేవలం పది నెలల్లోనే 25 కార్ల దొంగతనాలు చేసిన ఈ ముఠాలో, రమణ్ (56), అతని కుమారుడు సాగర్, అల్లుడు నీరజ్ ఉన్నారు.ఈ ముగ్గురు తమ పనిని తెల్లవారుజాముననే ప్రారంభించేవారు. పార్కులు, జిమ్‌లు దగ్గర నిలిపిన కార్లనే టార్గెట్ చేసేవారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి కేవలం ఐదు నిమిషాల్లోనే వాహనం సెక్యూరిటీ సిస్టమ్‌ను డిస్‌బుల్ చేసి పారిపోయేవారు. వీరు వాడే టెక్నిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.కార్లలో ఉండే డయాగ్నస్టిక్ పోర్ట్‌లకు ప్రత్యేక టూల్స్‌తో కనెక్ట్ అయి, సెక్యూరిటీని డిజేబుల్ చేసే పద్ధతిని వీరు పాటించేవారు. ఆన్‌బోర్డ్ మాడ్యూల్‌ని మానిప్యులేట్ చేసి, కొత్త కీ ద్వారా వాహనాన్ని తీసుకెళ్లే స్కిల్‌కి ఇది ఉదాహరణగా మారింది.
సీసీటీవీ ఫుటేజ్‌తో ముఠా పట్టివేత
ద్వారకా పోలీసులు శ్రద్ధగా విచారణ చేపట్టారు. సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, దొంగతనాల నమూనాను గుర్తించారు. చివరకు ఉత్తమ్‌నగర్‌లో వల వేసి, నకిలీ నంబర్‌ప్లేట్‌తో ఉన్న కారులో వచ్చిన రమణ్, సాగర్‌లను అరెస్ట్ చేశారు.
కారు నుండి దొంగ పరికరాల స్వాధీనం
వారి వాహనం తనిఖీలో రెండు కార్ స్కానర్లు, హ్యాండ్ క్లిప్, కీ కనెక్టర్లు, ఇంజిన్ మాడ్యూల్, లాక్ టూల్స్, వైర్ కట్టర్, ప్లయర్, నకిలీ నంబర్ ప్లేట్లు బయటపడ్డాయి. విచారణలో అల్లుడు నీరజ్ కూడా ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది.దొంగతనాలు చేసిన కార్లను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో విక్రయించినట్లు నిందితులు తెలిపారు. రమణ్‌పై ఇప్పటికే 18 కేసులు, సాగర్‌పై 12, నీరజ్‌పై 14 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also : MLA Prakash Goud : ఘనంగా జరిగిన వన మహోత్సవం : ప్రకాశ్ గౌడ్