జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు రజనీకాంత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ హృదయ విదారక ఘటనను ఖండించిన ఆయన, శాంతియుత కశ్మీర్‌ను చూసి శత్రువులు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కశ్మీర్‌లో నెలకొన్న శాంతిని భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ దాడిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్న వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దుశ్చర్యలు మళ్లీ కలలో కూడా చేయాలన్న ఆలోచన రాకుండా చర్యలు తీసుకోవాలని రజనీ కాంత్ అన్నారు.
జైలర్-2 చిత్రం అప్డేట్
ఈ సందర్భంగా రజనీకాంత్ తన నూతన చిత్రం ‘జైలర్-2’ గురించి కూడా మీడియాతో పంచుకున్నారు. కోయంబత్తూరులో ‘జైలర్-2’ షూటింగ్ ప్రారంభమైందని తెలిపారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అందించనున్నట్లు చెప్పారు. ఉగ్రదాడుల వంటి దుశ్చర్యలు దేశ శాంతికి ముప్పుగా మారుతున్నాయి కానీ, ప్రజల మనోధైర్యాన్ని మట్టిపరచలేవని రజనీకాంత్ చెప్పడం గమనార్హం.
పహల్గాం దాడిపై కేంద్రం కఠిన నిర్ణయాలు
ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ బాధ్యులుగా ఉన్నట్లు భద్రతా దళాలు నిర్ధారించాయి. దీనికి స్పందనగా, భారత్ పాకిస్థాన్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. ఇండస్ వాటర్ ట్రిటీ నిలిపివేతతో పాటు, పాకిస్థాన్ పౌరులను దేశం విడిచిపెట్టు మని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని స్పష్టంగా హెచ్చరించారు.